వామ్మో, తెలంగాణలో మరో కరోనా కేసు

కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కరోనా బారిన పడిన తొలి వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తర్వాత అతడికి నయమైంది. ఇంటికి పంపేశారు.
See Also | ఎవరూ తప్పించుకోలేరు: భారత్ మొదటి కరోనా బాధితుడికి చికిత్స చేసిన డాక్టర్‌కు పాజిటీవ్
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 7వేల 965మంది చనిపోయారు. అలాగే కరోనా బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్ష 98వేల 178 మంది కరోనా బారిన పడ్డారు. 7వేల 20మందికి సీరియస్ గా ఉంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పలు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ రూపొందించి, క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి.