ఇన్నాళ్లూ మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయం చేస్తుందా: కేటీఆర్

హైదరాబాద్: దేశాన్ని55 ఏళ్లు పాటు పాలించి, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ‘న్యాయ్” అంటూ ప్రజలను ఓట్లు అడుగుతోందని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలకు మోస పోవద్దని పని చేసే ప్రభుత్వాలనే గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ లో ఏర్పాటు చేసిన “మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్” లో ఆయన మాట్లాడుతూ ….హైదరాబాద్ నగరంలో జల, వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ నలుదిశలా ఐటీ పరిశ్రమను అభివృధ్ది చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపోందించిందని ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న160 కిలోమీటర్లు చుట్టు పక్కల టౌన్ షిప్ లను డెవలప్ చేయటానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని తద్వారా అందరికీ చౌకలో ఇళ్లు దోరికే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును 3 ,4 ఏళ్లలో ప్రారంభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ కాకుండా ఓఆర్ఆర్ అవతల అభివృధ్ది చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంచి నీటి సమస్యను పరిష్కరించామని, చెప్పారు. గతంలో హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య ఉండేదని సంవత్సరంలో నాలుగైదు రోజులు కర్ఫ్యూ ఉండేదని , గడచిన ఐదేళ్ళలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ లేకుండా శాంతి భద్రతలను ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. గతంలో విద్యుత్ సరఫరా సరిగా లేక పరిశ్రమలు పవర్ హాలిడే ప్రకటించేవని ఇప్పుడు పరిశ్రమలుక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని చాలా ఉందని, ఇదిచేతల ప్రభుత్వం అని ఆయన చెపుతూ కేంద్రంలో మనం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృధ్ది చేసుకోవచ్చని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు 16 సీట్లు వచ్చేలా మీరంతాఓట్లు వేసి రాష్ట్రాభివృధ్దికి సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.