పల్లె ప్రగతి : 10న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

తెలంగాణలో పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తొలి విడత పూర్తి కావడంతో… రెండో విడతపై దృష్టి సారించారు. ఇందుకోసం 2019, అక్టోబర్ 10న ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం సూచించిన అంశాలపై తొలి విడతలో గ్రామాల వారీగా సిద్ధం చేసిన నివేదికలను… అధికారులు సీఎంకు అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల కార్యాచరణలో భాగంగా అధికారులు ఊరూరా తిరిగారు. మౌలిక సదుపాయల కల్పనతో పాటు అభివృద్ధి పనులపై గ్రామ సభలు నిర్వహించి నివేదికలు తయారు చేశారు.
గురువారం ఉదయం 11 గంటలకు మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో భేటీ కానున్న కేసీఆర్… విడతలో గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామాలకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం… వాటిని ప్రణాళికబద్ధంగా వెచ్చించి తమ మార్క్ చూపించుకోవాలని భావిస్తోంది. అంశాల వారీగా అధికారులు సిద్ధం చేసిన నివేదికలపై పూర్తిస్థాయిలో చర్చించాక… సీఎం కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. 60 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించగా… తొలి విడతలో 30 రోజులు పూర్తయింది. రెండో విడత ఎప్పడు మొదలు పెట్టాలన్నది కలెక్టర్ల మీటింగ్‌లో కేసీఆర్ నిర్ణయించనున్నారు. మరోవైపు కలెక్టర్ల సమావేశంలో ఆర్టీసీ సమ్మె విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. సమ్మె కారణంగా తలెత్తిన సమస్యల్ని పరిష్కరించేలా జిల్లా కలెక్టర్లకు… సీఎం కేసీఆర్ సూచనలు చేస్తారని తెలుస్తోంది.
Read More : ఆర్టీసీ సమ్మె..నెక్ట్స్ ఏంటి? : పట్టువీడని కార్మికులు, మెట్టుదిగని ప్రభుత్వం