ఆశా దీపాలు : 5 ఎంపీ స్ధానాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆశలు

  • Published By: chvmurthy ,Published On : March 26, 2019 / 03:44 PM IST
ఆశా దీపాలు : 5 ఎంపీ స్ధానాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆశలు

Updated On : March 26, 2019 / 3:44 PM IST

పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న హస్తం పార్టీ.. కొన్ని స్థానాల్లో అయినా విజయం సాధించి కేడర్‌లో జోష్ నింపాలని భావిస్తోంది. అన్నిచోట్లా బరిలోకి దిగుతున్నా.. ఐదు స్థానాలపై తెలంగాణ కాంగ్రెస్ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజిగిరి స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ నమ్ముతోంది. 

నల్గొండ నుంచి టీఆర్ఎస్ రియల్టర్ వేమిరెడ్డి నర్సింహారెడ్డిని బరిలోకి దింపింది. రాజకీయాలకు కొత్త కావడం.. ఓటర్లకు పెద్దగా పరిచయం లేకపోవడంతో… వేమిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సునాయాసంగా విజయం సాధిస్తాడని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉత్తమ్ ఒక్కడే గెల్చినా.. బలమైన కేడర్ ఉండటం కలిసొస్తుందని భావిస్తోంది. అటు భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా విజయం సాధిస్తారని పార్టీలో ధీమా కనిపిస్తోంది. కోమటిరెడ్డి అనుచరులు.. పార్టీ కేడర్.. సీనియర్లు విభేదాలు పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తుండటం కలిసి వస్తుందని ఆశ. అయితే… ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య, యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీకి దూరమవడం మైనస్‌గా మారే అవకాశముంది. 

ఇక మల్కాజిగిరి స్థానంపై కూడా కాంగ్రెస్ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి… టీఆర్ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధిస్తారని ఆశలు పెట్టుకుంది.  రేవంత్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. అంతే కాకుండా. ప్రత్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎవరికీ పరిచయం లేదు. కేవలం మంత్రి మల్లారెడ్డి అల్లుడిగానే తప్ప.. పెద్దగా గుర్తింపు లేకపోవడం కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. 

సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి గెల్చినా… అసెంబ్లీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీలో చేరారాయన. నియోజకవర్గంలో పట్టు ఉండటం… సమస్యలపై పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించిన అంశాలు, కొండాకు క్లీన్ ఇమేజ్… ప్లస్ అవుతాయి. అయితే… సబిత టీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఆయనకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. మరోవైపు చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న రంజిత్‌రెడ్డికి నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేవు. పైగా  టీఆర్ఎస్ కేడర్‌కు, నేతలకు కూడా ఆయన పెద్దగా పరిచయంలేకపోవడం కలసిసొచ్చే అంశమని కాంగ్రెస్ భావిస్తోంది. 

చివరి వరకు సస్పెన్స్ ఉంచిన ఖమ్మం కూడా తమ ఖాతాలోనే పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. రేణుకాచౌదరి, టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో  పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ఎనిమిది స్థానాలను గెలవడం,  కాంగ్రెస్ ఆశలకు ప్రధాన కారణం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, మంత్రిగా పని చేసిన అనుభవం కలిసి వస్తుండగా  నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం మైనస్‌గా మారే అవకాశముంది. 

17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ ఐదు నియోజకవర్గాలు మాత్రం తమ ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి హస్తం పార్టీ నేతల ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో చూడాలి.