తెలంగాణాలో ఎన్నికల సీజన్ : మరోసారి ‘కోడ్’ కూసింది

తెలంగాణలో ఎన్నికల కోడ్‌కు ఎండ్ కార్డ్ పడటంలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వంతో మొదలైన కోడ్… పరిషత్ ఎన్నికల వరకు నిర్విరామంగా కూస్తూనే ఉంది. అంతలోనే మరో ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మరోసారి కోడ్ కూసింది. మొన్నటివరకు శాసనసభ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు… అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీఎసీ ఎన్నికలు.. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా తెలంగాణలో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. దీంతో దాదాపు 8 నెలలుగా ఎన్నికల కోడ్ నిర్విరామంగా కొనసాగుతోంది.
వరుస ఎన్నికల కోడ్‌తో పాలనాపరంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం విధానపరమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకునే వీలులేకుండా పోయింది. మరోవైపు.. తెలంగాణ అవతరణ దినోత్సవంలోపే.. అంటే జూన్ 2కు ముందే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముందని, పలు కీలక ప్రకటనలు వెలువడే ఛాన్సుందని వార్తలు వచ్చాయి. కానీ కోడ్ కంటిన్యూ అవుతుండడంతో వాటికి కూడా బ్రేక్ పడినట్లే.