China-Pak On Taliban : తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటించిన చైనా,పాక్
అఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలపై చైనా స్పందించింది.

Taliban2
China-Pak On Taliban అఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలపై చైనా స్పందించింది. అఫ్ఘానిస్తాన్‌లో బహిరంగ మరియు అందరినీ కలుపుకునే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మరియు హింస, ఉగ్రవాదం లేకుండా శాంతియుతంగా అధికార మార్పిడికి తాలిబాన్ కట్టుబడి ఉంటుందని చైనా సోమవారం ఆశాభావం వ్యక్తం చేసింది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లతో ‘స్నేహపూర్వక సంబంధాలు’ అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధమని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ..అప్ఘాన్ ప్రజలు స్వతంత్రంగా తమ గమ్యాన్ని నిర్ణయించే హక్కును చైనా గౌరవిస్తుంది మరియు అఫ్ఘానిస్తాన్‌తో స్నేహపూర్వక మరియు సహకార సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. కాబూల్ లోని చైనా రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని.. రాయబారి మరియు కొంతమంది సిబ్బందితో ఎంబసీ కార్యాలయం విధులు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే, చాలా మంది చైనా జాతీయులు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖాళీ చేయబడ్డారు.
కాగా,అప్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలనను తాము అంగీకరిస్తామని గతంలోనే చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. జులై-28న చైనాలోని టియాంజిన్ నగరంలో.. తొమ్మిది మంది తాలిబన్ ప్రతినిధి బృందంతో చైనా విదేశాంగశాఖ మంత్రి భేటీ అయ్యారు. చైనా విదేశాంగ మంత్రిని కలిసినవారిలో… ప్రస్తుతం అప్ఘానిస్తాన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న తాలిబన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు సంస్థ డిప్యూటీ లీడర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కూడా ఉన్నారు.
ఇక,ప్రవర్తన ఆధారంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తామని రష్యా తెలిపింది. అఫ్ఘానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడం లేదా గుర్తించకపోవడం అనే దానిపై రష్యా తొందరపడదని… తాలిబాన్ తిరుగుబాటుదారులు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నామని…తాలిబన్ ప్రభుత్వ పని తీరును గమనించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియమించిన అఫ్ఘనిస్థాన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ సోమవారం తెలిపారు. అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, తాలిబన్లు బలవంతంగా ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని ఐరాసలోని మెజార్టీ సభ్య దేశాలు ఖండించాయి.
మరోవైపు, అఫ్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల వంటి రాక్షస మూకల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దీనిని బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించడం గమనార్హం. అప్ఘాన్ లో తాలిబాన్ల రాజ్యాన్ని స్వాగతించిన ఇమ్రాన్ ఖాన్..తాలిబాన్ బానిసత్వ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్‌ను ఓ మీడియంగా తీసుకోవడంపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకొని పూర్తిగా దానికి విధేయులుగా మారుతున్నారు. అదే జరిగితే అది బానిసత్వం కంటే కూడా దారుణం. సాంస్కృతికి బానిసత్వాన్ని వదులుకోవడం అంత సులువు కాదు. అఫ్ఘానిస్తాన్ లో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి.. వాళ్లు బానిసత్వపు సంకెళ్లను తెంచారు అని ఇమ్రాన్ అన్నారు. ఇక, ఇవాళ నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశానికి పిలుపునిచ్చిన పాక్ ప్రధాని… అఫ్గాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు. సీనియర్ రాజకీయవేత్త, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా సహా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.