చైనా వధువుతో భారత్ వరుడి పెళ్లి

  • Published By: chvmurthy ,Published On : February 3, 2020 / 08:24 AM IST
చైనా వధువుతో భారత్ వరుడి పెళ్లి

Updated On : February 3, 2020 / 8:24 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నవేళ  చైనా అమ్మాయి, ఇండియా అబ్బాయి ఒకింటివారయ్యారు. పెళ్లికి వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. ప్రపంచమంతా చైనా వైరస్ తో వణికిపోతుంటే వీడేంటి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని…వారి ప్రేమ ముందు చైనా వైరస్ కరోనా కూడా వెనక్కి తగ్గింది.

కరోనా వైరస్ వ్యాప్తితో  చైనాకి రాకపోకలు తగ్గిపోయాయి. మరోవైపు చైనాలో ఉన్న భారతీయులను విడతల వారీగా ఇండియా తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన యువతి కుటుంబ సభ్యులే ఇండియా వచ్చి వారి అమ్మాయి  పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఈ ఘటన మద్యప్రదేశ్ లోని మాందసౌర్ లో జరిగింది.
 

చైనాకు చెందిన జిహావో వాంగ్‌, భారత్‌కు చెందిన సత్యార్థ్‌ మిశ్రా ఐదేళ్ల క్రితం కెనడాలో కలిసి చదువుకున్నారు. ఈ సమయలో వారిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ  రెండు వైపులా పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఫిబ్రవరి2న, వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ముహూర్తం నిర్ణయించుకున్నాయి. అయితే ఈలోగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందటంతో అక్కడ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. మరోవైపు చైనా నుంచి వచ్చే వాళ్ల ఇ-వీసాను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసింది.
 

ఈ పరిస్ధితుల్లో జిహావో కుటుంబ సభ్యులు తమకుమార్తె పెళ్లి చేసేందుకు భారత్‌ రావటానికి అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. అధికారులు మొదట వీసా నిరాకరించారు. దీంతో వారు మరోసారి అధికారులను సంప్రదించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే భారత్‌లో ప్రవేశించాలని సూచించారు. ఈ క్రమంలో చైనాలో అన్ని రకాల టెస్టులు ముగిసిన తర్వాత బుధవారం జనవరి 29న వధువుతో సహా ఆమె తల్లిదండ్రులు మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌ వెళ్లేందుకు అధికారులు అనుమతినిచ్చారు. దీంతో వారు మధ్యప్రదేశ్ కు చెందిన మాందసౌర్‌ కి విచ్చేశారు.
 

భారత్ కి వచ్చాక కూడా వారికి ఐదుగురు వైద్యులతో కూడిన బృందం పరీక్షలునిర్వహించారు. ఎవరికీ వైరస్ లేదని తేలటంతో ఆదివారం ఫిబ్రవకి 3న వారి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ విషయం గురించి జిహావో తండ్రి షిబో వాంగ్‌ మాట్లాడుతూ..‘మాకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అందుకు మేము ఏమాత్రం ఇబ్బంది పడలేదు. నిజానికి మేము నివాసం ఉండే చోట కరోనా వైరస్‌ వ్యాపించలేదు. అయినప్పటికీ అందరి క్షేమం దృష్ట్యా  వైద్యాధికారులకు సహకరించాం. మా కూతురి పెళ్లి జరిగిపోయింది. ఇక మేం తిరిగి చైనాకు వెళ్లిపోతాం’ అని తెలిపారు.
 

మరో వైపు ఇండియాలో 3 కరోనా వైరస్ కేసును గుర్తించారు. ఇప్పటివరకు ఇండియాలో నమోదైన కేసులు 3 కేరళలోనే ఉండటం గమనార్హం.  దేశవ్యాప్తంగా 25 దేశాలకు కరోనా వైరస్ పాకింది. ఈ వ్యాధి సోకి ఇప్పటివరకు చైనాలో 360 మంది మరణించారు.  దాదాపు 15 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. జనవరి 15 నుంచి  చైనా నుంచి భారత్ కు వచ్చిన వారందరికి  కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.