పాకిస్తాన్‌కి అది అలవాటే: ఐక్యరాజ్యసమితిలో భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై విరుచుకుపడింది భారత్. తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్తాన్ అలవాటుగా పెట్టుకుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది భారత్. కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందంటూ ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్ నాయుడు పాకిస్తాన్‌పై మండిపడ్డారు.
‘ఎప్పటి మాదిరిగానే ఒక ప్రతినిధి బృందం మాపై విద్వేషపూరితమైన ఆరోపణలు చేస్తుందని, ప్రతీసారి ఆ ప్రతినిధి ఇలాగే ప్రవర్తిస్తున్నారని, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను వినేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరనే విషయాన్ని ఆ దేశం గ్రహించాలని హితవు పలికారు నాయుడు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో మాట్లాడిన నాయుడు పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. మైనార్టీలను సర్వనాశనం చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు నాయుడు. జమ్ముకశ్మీర్ అంశాన్ని పాక్ కౌన్సిలర్ సయీద్ అహ్మద్ లేవనెత్తడంతో నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఇంతకుముందు కూడా చైనా, పాకిస్తాన్‌లు మూడు సార్లు ప్రయత్నించాయి.