ముందు జాగ్రత్త.. 30కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ చేసిన అమెరికా

ఇంకా కరోనా వ్యాక్సిన్ రానే లేదు. కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అగ్రరాజ్యం

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 03:20 AM IST
ముందు జాగ్రత్త.. 30కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ చేసిన అమెరికా

Updated On : May 22, 2020 / 3:20 AM IST

ఇంకా కరోనా వ్యాక్సిన్ రానే లేదు. కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అగ్రరాజ్యం

ఇంకా కరోనా వ్యాక్సిన్ రానే లేదు. కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 30 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ చేసింది అమెరికా. వ్యాక్సిన్ తయారు చేస్తున్న బ్రిటన్‌-స్వీడన్‌ బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా(Astrazeneca)తో అమెరికా ఈ ఒప్పందం చేసుకుంది. దీన్ని ఒక మైలురాయిగా అమెరికా అభివర్ణించింది. ఆస్ట్రాజెనెకా ఈ ఏడాది ఒక బిలియన్ మోతాదు COVID-19 వ్యాక్సిన్‌ను అందించగలదని సమాచారం. 

40కోట్ల డోసుల టీకా ఉత్పత్తి:
కరోనా టీకా ఇంకా ప్రయోగశాలను దాటలేదు. వ్యాక్సిన్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. దీనికి సంబంధించి మొదటి ఒప్పందం గురువారం(మే 21,2020) కుదిరింది. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ఉత్పత్తికి బ్రిటన్‌-స్వీడన్‌ బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా(Astrazeneca) అవగాహన కుదుర్చుకుంది. దీని ప్రకారం తొలుత 40 కోట్ల డోసుల మేర ఈ టీకాను ఉత్పత్తి చేయనుంది. మొత్తం మీద 100 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లు తెలిపింది. అయితే ఈ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బార్డా) నుంచి 120 కోట్ల డాలర్ల పెట్టుబడి సమకూరింది. టీకా అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా కోసం ఈ సొమ్మును అందించింది. దీంతో కొవిడ్‌-19 వ్యాక్సిన్లను పూర్తిగా చేజిక్కించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

సెప్టెంబర్‌లో తొలి విడతగా కరోనా వ్యాక్సిన్ సరఫరా:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడతగా టీకాలను సరఫరా చేస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ నిర్వహించే మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకూ తోడ్పాటు అందిస్తామని వివరించింది. ఇందులో 30వేల మంది పరీక్షార్థులపై ప్రయోగాలు జరుగుతున్నాయని, చిన్నారులపైనా పరీక్షలు ఉంటాయని తెలిపింది. ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌1 ఎన్‌కోవ్‌-19’గా ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగాత్మక టీకా పేరు. తాజా ఒప్పందంతో ఏజడ్‌1222గా మారింది. సాధ్యమైనంత వేగంగా, విస్తృతంగా కొవిడ్‌-19 టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామంది. టీకా ఉత్పత్తి కోసం కుదిరిన ఒప్పందాన్ని నిపుణులు స్వాగతించారు. ఈ టీకా పనిచేయకపోయే అవకాశమూ ఉంది. ఆ సంగతీ తమకు తెలుసని ఆస్ట్రాజెనెకా తెలిపింది. అయినప్పటికీ రిస్కుతో ఉత్పత్తి చేయడానికి సిద్ధపడ్డామని వివరించింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసే బాధ్యతను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టనుంది.

ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌:
మొదట ఉత్పత్తయ్యే టీకాల్లో 30-40 కోట్ల డోసులు అమెరికాకు చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్‌ నాటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేలా చూడటానికి ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ఇప్పటికే ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో టీకా ఉత్పత్తిని వేగంగా చేపట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’లో(Operation Warp Speeds) ఇది భాగమని చెబుతున్నారు. ఔషధ కంపెనీలు తమ సొంత ప్రభుత్వాల నుంచి మద్దతు పొందే ‘టీకా జాతీయవాదం’ పెరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ధనిక దేశాలకే టీకాలు లభించే పరిస్థితి వస్తుందని కొందరు చెబుతున్నారు. తొలి విడత సరఫరాలను దక్కించుకునేందుకు ఆక్స్‌ఫర్డ్‌ ప్రాజెక్టులో 6.55 కోట్ల పౌండ్ల పెట్టుబడి పెడతామని బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే అమెరికా తాజాగా పెట్టిన 120 కోట్ల డాలర్ల ముందు అది వెలవెలబోతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సనోఫి(Sanofi) చేపడుతున్న టీకా అభివృద్ధి కార్యక్రమానికీ అమెరికా నిధులు అందించింది. రిస్కు తీసుకొని పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన అమెరికాకే ఈ టీకా సరఫరాలో ప్రాధాన్యం ఉంటుందని సనోఫి(Sanofi) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాల్‌ హడ్సన్‌ చేసిన వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో కలకలం రేపాయి. దీనిపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కూడా మండిపడ్డారు.

40కోట్ల డోసుల టీకా సరఫరాకు బ్రిటన్ ఆర్డర్:
ఇంకా మోడెర్నా(Moderna), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (Johnson and Johnson) వంటి సంస్థల టీకాపై కూడా అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచం మొత్తానికీ సమాన స్థాయిలో, న్యాయబద్ధంగా టీకా పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కృషి చేస్తామని ఆస్ట్రాజెనెకా తెలిపింది. టీకా సరఫరాలో బ్రిటన్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. కాగా, బ్రిటిష్ డ్రగ్ మేకర్ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. టీకా అందుబాటులోకి వస్తే ముందుగా 400 మిలియన్ డోసుల టీకా తమకు సరఫరా చేయాలని ఒప్పందం చేసుకుంది.

Read: లాక్‌డౌన్‌ ధనవంతులు : అమెరికా బిలియనీర్ల ఆదాయం 434 బిలియన్ డాలర్లు