Dearness Allowance: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు
ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగబోతుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది.

Dearness Allowance
7th Pay Commission: ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగబోతుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్(DA) 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభం చేకూరనుంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నాయి.
2019 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ మాత్రమే వస్తోంది. 2020 జనవరిలోనే దీనిని సమీక్షించాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏ పెంపుపై నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా గత ఏడాది జనవరి 1, జూలై 1, ఈ సంవత్సరం జనవరి 1న మొత్తం మూడు విడతల్లో చెల్లించాల్సిన డీఏను ఆపేసింది.
దీంతో మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, లక్షలాది మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. పెంచిన డీఏను గత వాయిదాలకు కలిపి చెల్లించే విధంగా కేంద్రం ఆదేశించింది. అయితే ఈసారి సుమారు 11 శాతం వరకు డీఏను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.