ముగిసిన తొలిదశ : 55 శాతం పోలింగ్

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. చెదురు ముదురు ఘటనలు తప్ప మొత్తానికి తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 7 రాష్ట్రాలలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- యూపీలో 59.77 శాతం.
- బిహార్‌లో 50.26 శాతం.
- అసోంలో 68 శాతం. మణిపుర్‌లో 78.20 శాతం.
- మేఘలయలో 62 శాతం.
- త్రిపురలో 81శాతం.
- వెస్ట్ బెంగాల్‌లో 81 శాతం.
- లక్ష్యద్వీప్‌లో 65.9 శాతం.
- అండమాన్‌లో 70 శాతం.
- తెలంగాణ 60 శాతం.
- ఛత్తీస్‌గఢ్ 56 శాతం.
- ఉత్తరాఖండ్ 57.58 శాతం.
జమ్ముకశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. జమ్ము, బారముల్లా లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.17 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 46.13 శాతం, ఒడిశాలో సాయంత్రం 4 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత మల్కాన్‌గిరిలో 15 బూతులలో జీరో పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఇక్కడ ఒక్కరు కూడా ఓటు వేయకపోవడంతో ఎన్నికల నిర్వహణ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరిగారు.