మరో 72వేల అమెరికన్ రైఫిల్స్‌కు భారత్ ఆర్డర్

సరిహద్దు సమస్యపై చైనాతో వివివాదం కొనసాగుతున్న సమయంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి మరో 72 వేల Sig 716 అసాల్ట్ రైఫిల్స్‌కు ఆర్డర్ ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది కాగా, ఇప్పటికే నార్తరన్ కమాండ్‌తో పాటు ఇతర ఆపరేషన్ ప్రదేశాల్లో ఉపయోగించేందుకు 72,000 సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్ ను ఇండియన్ ఆర్మీ ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ రైఫిల్స్ అందిన వెంటనే రెండో బ్యాచ్‌కు ఆర్డర్ ఇవ్వనుంది.
కౌంటర్ టెర్రరిజంపై పోరాడేందుకు మొదటి బ్యాచ్ సిగ్ సౌర్ అసాల్ట్ రైఫిల్స్ ను భారత సైన్యం అందుకోబోతుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్(ఎఫ్‌టీపీ) కార్యక్రమం కింద భారత్ ఈ రైఫిల్స్‌ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఉన్న ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టం(INSAS) రైఫిల్స్ స్థానంలో ఈ కొత్త రైఫిల్స్‌ను ఇండియన్ ఆర్మీ ఉపయోగించనుంది. భారత సైన్యం చాలా సంవత్సరాలుగా ఇన్సాస్(INSAS) రైఫిల్స్‌ను మార్చడానికి ప్రయత్నిస్తోంది, కాని అనేక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇన్సాస్ రైఫిల్స్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో స్థానికంగా తయారు చేశారు.
ప్రణాళిక ప్రకారం సుమారు 1.5 లక్షల ఇంపోర్టెడ్ రైఫిల్స్‌ను ఉగ్రవాద నిరోధక చర్యల్లో అదేవిధంగా నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) లోని ఫ్రంట్‌లైన్ విధుల్లో ఉన్న సైనికులకు అందించాల్సి ఉంది. మిగిలిన దళాలకు ఏకే-203 రైఫిల్స్‌ను అందించనున్నారు. వీటిని అమేథి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారత్, రష్యా సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఈ తుపాకుల కొరతను తొలగించడానికి ఇజ్రాయెల్ నుండి 16,000 లైట్ మెషిన్ గన్స్ (ఎల్‌ఎమ్‌జి) ఆర్డర్ ఇచ్చింది.