భారత్‌లో 24 గంటల్లో 194 కరోనా కేసులు.. 933కి పెరిగిన కేసులు..21 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 12:18 AM IST
భారత్‌లో 24 గంటల్లో 194 కరోనా కేసులు.. 933కి పెరిగిన కేసులు..21 మంది మృతి

Updated On : March 29, 2020 / 12:18 AM IST

భారత్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 933కు చేరుకుంది. కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. తాజాగా తెలంగాణ, కేరళలో కరోన వైరస్‌ తొలి మరణాలు సంభవించాయి.

లాక్‌డౌన్‌ ఉల్లంఘించకుండా పలు చర్యలు 
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా పలు చర్యలు తీసుకుంది. అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ కుటుంబాలతో సహా నగరాల నుంచి గ్రామాలబాట పట్టడం ఆందోళన కలిగిస్తోందన్న కేంద్రం… కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. నిత్యావసర వస్తువుల సరఫరాకు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా విజృంభిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన 
కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా… సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పకుడా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.  కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్‌ ముందుకు వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ఆసుపత్రులుగా మార్చే అంశంపై కేంద్రం ఆలోచన చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం 
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లు…అంతకన్నా తక్కువ శిక్ష పడ్డ ఖైదీలను 8 వారాల పాటు పెరోల్‌పై విడుదల చేయాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయ్. టాటా ట్రస్ట్ తరపున రతన్‌ టాటా 500 కోట్ల విరాళం ప్రకటించగా… టాటా సన్స్‌ అదనంగా మరో 1000 కోట్లను కరోనా వైరస్‌కోసం ఖర్చు చేయనున్నట్లు రతన్‌టాటా తెలిపారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తన వంతు సాయంగా 25 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్టు తెలిపారు.