గూఢచర్యం కేసు, ఇస్రో మాజీ సైంటిస్టు నంబి నారాయణన్‌కు రూ.1.30కోట్ల నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం

కేరళ ప్రభుత్వం రూ.1.30 కోట్ల నష్టపరిహారం మొత్తాన్ని ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ కు మంగళవారం(ఆగస్టు 11,2020) అందజేసింది. 1994లో నకిలీ గూఢచార కుంభకోణం కేసులో నంబి నారాయణన్ ను ఇరికించారు. దీనిపై 78ఏళ్ల నంబి నారాయణన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సబ్ కోర్టుని ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారని కోర్టుకి తెలిపారు.
నంబి నారాయణన్ ను అనవసరంగా అరెస్ట్ చేశారని, వేధింపులకు గురి చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మూడు వారాల అనంతరం ప్రభుత్వం నంబి నారాయణన్ కు నష్టపరిహారంగా రూ.50 లక్షలు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.10లక్షలు కూడా ఇచ్చింది. 1994లో గూఢచర్యం కేసు కలకలం రేపింది. ఓ ముఠా సభ్యులు భారత రాకెట్ రహస్యాలను తస్కరించి దొంగచాటుగా పాకిస్తాన్ సహా విదేశాలకు అమ్ముతున్నారని, వారికి ఇస్రోలో పనిచేసే ఇద్దరు శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని, అందులో నంబి నారాయణన్ కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
గూఢచర్యం కేసులో పోలీసులు నంబి నారాయణన్ ను అరెస్ట్ చేశారు. ఆయన రెండు నెలలు జైల్లో గడిపారు. నంబి నారాయణన్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని సీబీఐ తేల్చే వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ కేసుని తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాఫ్తు చేశారు. ఆ తర్వాత కేంద్ర దర్యాఫ్తు సంస్థకు విచారణ బాధ్యత అప్పగించారు. వారి విచారణలో గూఢచర్యం ఆరోపణలు అవాస్తవం అని, నంబి నారాయణ్ నిర్దోషి అని తేలింది.
కాగా నంబి నారాయణన్ బాగా హర్ట్ అయ్యారు. తనపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయించారు. మాజీ డీజీపీ సిబీ మ్యాథ్యూస్, ఇద్దరు ఎస్పీలు తన అక్రమ అరెస్ట్ కారణం అని నంబి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆ పోలీసులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నంబి నారాయణన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
అసలేం జరిగింది? గూఢచర్యం కేసు ఎందుకు పెట్టారు?
అది 1994 నవంబర్ 30. అప్పటికి నంబి నారాయణన్ వయసు 53 ఏళ్లు. ఇస్రోలో క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్ తయారీ ప్రాజెక్టుకు అప్పుడు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆ ఇంజిన్ తయారీకి సంబంధించిన సాంకేతికతను రష్యా నుంచి తీసుకురావడానికి ఆయన బాధ్యులుగా ఉన్నారు. ఓ రోజు మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఆయన నివాసానికి ముగ్గురు పోలీసులు వచ్చారు. నంబి నారాయణ్ ను తమ వెంట స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఏదో నేరం చేసినవాళ్లను చూసినట్లుగా అందరూ ఆయనను అదో రకంగా చూశారు. తరువాతి రోజు ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
నంబి నారాయణన్ దేశద్రోహానికి పాల్పడ్డారని, పోలీసులు అరెస్ట్ చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. నారాయణన్ పాకిస్తాన్‌కు రాకెట్ సాంకేతికతను అమ్మారని, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు వేసిన హనీ ట్రాప్‌లో పడిపోయిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారంటూ కథనాలు ప్రచురించారు.
1994లో తన జీవితం తలకిందులయ్యే వరకూ స్వదేశీ రాకెట్ల తయారీ కోసం నంబి నారాయణన్ ఎనలేని కృషి చేశారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆయన అరెస్టుకు నెల రోజుల ముందు జరిగింది. అనంతరం కొన్ని వారాల తర్వాత ఆమె స్నేహితురాలు ఫయూజియ్యా హసన్‌ను కూడా అరెస్టు చేశారు. మాల్దీవులకు చెందిన ఆ మహిళలు గూఢచారులని, భారత రాకెట్ రహస్యాలను తస్కరించి దొంగచాటుగా పాకిస్తాన్‌కు అమ్ముతున్నారని, వారికి ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు స్థానిక పత్రికలు రాశాయి. ఆ మహిళలు వేసిన వలలో పడిన శాస్త్రవేత్తల్లో నంబి నారాయణన్ కూడా ఉన్నారని అప్పుడు పోలీసులు ఆరోపించారు.
ఆ తర్వాత ఈ కేసుని సీబీఐ దర్యాఫ్తు చేసింది. నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురు నిర్దోషులేనని 1996లో సీబీఐ ప్రకటించింది. ఇస్రోకు చెందిన రహస్య పత్రాలను తస్కరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. క్రయోజెనిక్ ఇంజిన్లకు సంబంధించిన డ్రాయింగులేవీ చోరీకి గురికాలేదని ఇస్రో చేపట్టిన అంతర్గత దర్యాప్తులోనూ తేలింది. దీంతో నంబి నారాయణన్ నిర్దోషిగా తేలారు. 1998లో నిర్దోషిగా తేలిన తరువాత డాక్టర్ నారాయణన్ మళ్లీ ఇస్రోలో చేరారు. అయినా, ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. ఆ కేసును సీబీఐ మూసివేసినా. స్థానిక ప్రభుత్వం మళ్లీ కేసును తెరిచేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. చివరికి, ఆ కేసును 1998లో దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. ఆయనకు రూ.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అయితే, తాను అనుభవించిన ‘బాధ’.. నగదు పరిహారంతో తీరిపోయేది కాదని, 50 లక్షలు కాదు..రూ.5 కోట్లు అయినా ఆ గాయం మానిపోదు’ అని నారాయణన్ అన్నారు. అన్యాయంగా అరెస్టు చేసి, వేధించినందుకు ఆయనకు మరో కోటి 30 లక్షల రూపాయలు కూడా పరిహారంగా చెల్లిస్తామని కేరళ ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో తెలిపింది. కాగా నంబి నారాయణన్ పై తప్పుడు కేసు పెట్టడం వెనకున్న కారణమేంటన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికత అభివృద్ధితో భారత్ ముందుకెళ్తుందన్న అక్కసుతో మరే శక్తి అయినా తనపై కుట్ర పన్నిందేమో అని డాక్టర్ నారాయణన్ అనుమానిస్తున్నారు.
”భారత్‌లో అత్యధిక పీడనంతో కూడిన ఇంజన్‌ను తక్కువ కాలంలో డాక్టర్ నారాయణన్ అభివృద్ధి చేశారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు అది చాలా కీలకమైన ఇంజన్. ఆయన సామర్థ్యం, ఆయన అందించిన సేవలను అది చాటుతుంది” అని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ అన్నారు.
ముఖ్యమైన తేదీలు:
1994 – నారాయణన్‌ను అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 1995 జనవరిలో ఆయన బెయిల్ వచ్చింది.
1996 – ఈ కేసులో డాక్టర్ నారాయణన్ నిర్దోషి అని సీబీఐ ప్రకటించింది.
1998 – కేరళ ప్రభుత్వ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2001 – ఆయనకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2018 – తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2019లో నంబి నారాయణన్ భారత ప్రతిష్టాత్మక పద్మా పురస్కారం అందుకున్నారు.