గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన బర్త్ డే వీడియో

గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన బర్త్ డే వీడియో

Updated On : September 18, 2019 / 1:46 PM IST

ఆరు కేసుల్లో నిందితుడిగా ఉంటూ లోకల్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తిని పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకోగలిగారు. సోషల్ మీడియాలో దొరికిన బర్త్ డే వీడియో ఆధారంగా విచారణ జరిపి నేరస్థులను పట్టుకున్నారు. నిఖిల్ చౌహన్ అలియాస్ ధన్నా అనే వ్యక్తి కొద్ది రోజుల ముందే స్థానిక నేరగాళ్ల ముఠాలో చేరాడు. అందరిలో ఫేమ్ తెచ్చుకోవాలని గన్‌లతో షూట్ చేసిన వీడియోను పోస్టులు పెడుతూ వస్తున్నాడు. 

ఇదే క్రమంలో ప్రతీక్‌ ఛబ్రా అనే గ్యాంగ్ స్టర్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్న వీడియోను పోస్టు చేశాడు. అతడిపై అత్యాచారం, గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద పలు కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో 2012లో ఓ బిల్డర్‌ను రూ. లక్ష ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు గురి చేశాడు ఛబ్రా. కానీ ఆ బిల్డర్‌ డబ్బు చెల్లించడానికి ఒప్పకోకపోవడంతో ఛబ్రా తన గ్యాంగ్‌తో కలిసి రోడ్డు మీదే అతడిపై దాడి చేశాడు. ఆ కేసు విషయంలో పోలీసులకు చబ్రా దొరికేశాడు. 

రెండుమూడేళ్లుగా  ఛబ్రా కోసం గాలిస్తున్న ఢిల్లీ పోలీసులకు వారం రోజుల క్రితం ఛబ్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో బాగా ఉపయోగపడింది. తుపాకీతో కేక్‌ కట్‌ చేసి.. హల్‌చల్‌ చేసి ఆ తర్వాత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. ఛబ్రా గురించి, అతడి గ్యాంగ్‌లో ఉండే సభ్యులకు సంబంధించిన క్లూస్‌ను ఈ వీడియో నుంచి సేకరించి వ్యూహం ప్రకారం.. ఛబ్రాను పట్టుకోగలిగారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఛబ్రాతో పాటు నిఖిల్‌ చౌహాన్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.