Hathras Protest : నన్ను ఎవరూ ఆపలేరు – రాహుల్

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 12:57 PM IST
Hathras Protest : నన్ను ఎవరూ ఆపలేరు – రాహుల్

Updated On : October 3, 2020 / 1:35 PM IST

Hathras Protest : హత్రాస్ (Hathras) నివురుగప్పిన నిప్పులా మారింది. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అనే డిమాండ్‌తో కాంగ్రెస్ యూపీ ఇంచార్జ్ ప్రియాంక ధర్నాకు దిగారు. మరోవైపు.. TMC MP తో పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



ఈ క్రమంలో హత్రాస్ (Hathras) వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్ మరో ప్రయత్నం చేపడుతోంది. తనను అక్కడకు వెళుతానని..ఎవరూ ఆపలేరని రాహుల్ గాంధీ వెల్లడించారు.



ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, ఇతర మద్దతు దారుల బృందంతో కలిసి రాహుల్ హత్రాస్ కు వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరమార్శించనున్నారు.


ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా, రాజకీయ నేతలను ఎవరినీ ఆ ప్రాంతంలోకి రానీయకుండా నిషేధం విధించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా వారితో వెళ్లనున్నారు.



19 ఏళ్ల యువతిపై జరిగిన దాడిపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలతో ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌ అట్టుడుకుతోంది. మృతురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లక్నో సహా… దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రజా, మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం రోడ్డెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మౌనంగా కూర్చోం. పోరాడుతూనే ఉంటాంమని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శని ప్రియాంక. ఢిల్లీలోని వాల్మీకి ఆలయాన్ని సందర్శించారు. హత్రాస్ బాధితురాలి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేశారు. వాల్మీకీ సమాజం కార్యకర్తలతో పాటు ఆమె ధర్నాలో పాల్గొన్నారు. హథ్రస్‌ బాధితురాలికి న్యాయం జరగాలంటే దేశంలోని మహిళలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు ప్రియాంకా.



మరోవైపు… .యూపీ పోలీసులు మరోసారి దౌర్జన్యంగా వ్యవహరించారు. రాహుల్‌ గాంధీని తోసేసినట్లే.. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ను పోలీసులు కిందపడేశారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళ్లిన టీఎంసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తృణమూల్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కింద పడిపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.



హత్రాస్‌ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతుండటంతో.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు.



ఇక.. నిర్భయ హత్యాచారం కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దోషులకు శిక్షపడేలా చేసిన మహిళా న్యాయవాది సీమా కుష్వాహా.. హత్రాస్ కేసులోనూ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు సీమా ప్రయత్నించింది. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బాధితురాలి సొంత గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. రాకపోకలను నియంత్రించేందుకు వీలుగా గ్రామం చుట్టుపక్కల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.