హేమమాలిని డ్యాన్స్ : మంత్రి సుష్మా ఫిదా

ఢిల్లీ : ప్రఖ్యాత బాలీవుడ్ నటి..క్లాసికల్ డ్యాన్సర్ హేమామాలిని నృత్య ప్రదర్శనను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసించారు. హేమామాలిని నృత్య ప్రదర్శన చూసి మాటలు రావడం లేదన్నారు. నా జీవితంలో తొలిసారి గొప్ప నృత్య ప్రదర్శనను చూశానన్నారు సుష్మాస్వరాజ్. తన నృత్య ప్రదర్శనను వీక్షించి…ప్రశంసించిన వారికి హేమమాలిని కృతజ్ఞతలు తెలిపారు. 90 నిమిషాల పాటు గంగా రూపంలో హేమామాలిని నృత్య ప్రదర్శనకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసలు జల్లు కురిపించారు.
భారతీయులు పవిత్ర గంగగా పూజించే గంగానది వ్యర్థాలతో మరింతగా కలుషితమయిపోతోంది. దేశ జనాభాలో 40 కోట్ల మందికిపైగా అవసరాలకు ఉపయోగపడే గంగానది అదే ప్రజల నిర్లక్ష్యానికి గురౌవుతోంది.దీంతో పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యర్థాలు నదిలోకి చేరుతున్నాయి. ప్రత్యేకించి హరిద్వార్ నుంచి కాన్పూర్ మధ్యలో మల మూత్రాలతో, పరిశ్రమల వ్యర్థాలతో గంగానది ఎక్కువగా కలుషితమవుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఇటీవల ఓ నివేదికలో తెలిపింది. పలు ప్రాంతాల్లో ప్రజలు, పరిశ్రమలు ఏళ్ల తరబడి వ్యర్థాలను ఈ నదిలో వేస్తుండడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదిగా మారిపోయింది. ఈ క్రమంలో గంగానది కలుషిత కాసారంగా మారిపోతోందని తెలిపేలా నటి హేమమాలిని డ్యాన్స్ పలువురిని అలరించింది. కేవలం డ్యాన్స్ చూసి మెచ్చుకోవటమేకాక..కాలుష్యం నుండి గంగను కాపాడేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు బాధ్యతగా భావించి రానున్న తరాలకు స్వచ్ఛమైన గంగను అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.