అక్రమ వలసదారులకు కర్ణాటకలో తొలి డిటెన్షన్ సెంటర్!

పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురువుతోంది. ఒకవైపు అసోం ప్రజలంతా ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తుంటే.. మరోవైపు రాజకీయ విపక్షాలు సైతం.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. పౌరసత్వ చట్టం CAAతో ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, నేను మీ సేవకుడిని నన్ను నమ్మండి అంటూ మోడీ భరోసా ఇచ్చినా ఆందోళనలు ఆగడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ దేశంలో వలసదారుల కోసం ఎక్కడ కూడా ఒక డిటెన్షన్ సెంటర్ (నిర్బంధ కేంద్రం) లేదని ప్రకటించారు.
అక్రమ వలసదారుల కోసం దేశంలో ఎక్కడా ఒక్క డిటెన్షన్ సెంటర్ కూడా లేదని మోడీ ప్రకటించిన రెండు రోజుల్లోనే కర్ణాటకలో తొలి డిటెన్షన్ సెంటర్ వెలిసింది. అక్రమ వలసదారుల కోసం బెంగళూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో నీలమంగళకు సమీపంలో ఇదివరకే నిర్భంద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ‘అక్రమ వలసదారుల నివాసం కోసం డిటెన్షన్ సెంటర్ రెడీగా ఉంది’ అని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కమిషనర్, ఆర్ఎస్ పెద్దప్పయ్య తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర టాప్ హోంశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
కర్ణాటకలో జనవరిలో డిటెన్షన్ సెంటర్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు అంతకంటే ముందుగానే సెంటర్ వెలవడం గమనార్హం.అప్పటి నుంచి ఇప్పటివరకూ అక్కడ అక్రమ వలసదారులు ఎవరూ నమోదు కాలేదు. విదేశీ ప్రాంతీయ నమోదు కార్యాలయం.. అక్రమ వలసదారులను గుర్తించి వారిని నిర్భంద కేంద్రానికి తరలిస్తుంది.
వారికి అవసరమైన సదుపాయాలు, సిబ్బందితోపాటు వసతి కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పెద్దప్పయ్య తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ హాస్టళ్లను డిటెన్షన్ సెంటర్లుగా ప్రభుత్వం మార్చేసింది. ఈ కేంద్రాల్లో ఆరు గదులతో పాటు ఒక కిచెన్, ఒక సెక్యూరిటీ రూం ఉంటుంది. ఇక్కడ 24 మంది వరకు వసతి కల్పించవచ్చు. రెండు వాచ్ టవర్లను నిర్మించడమే కాకుండా భద్రత వలయంతో కూడిన కంపౌడ్ వాల్ కూడా ఉంది.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్రమ వలసదారులకు సంబంధించిన 35 తాత్కాలిక నిర్బంధ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించామని గత నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు విన్నవించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు అక్రమ వలసదారులకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. విదేశీ చట్టం సహా ఇతర చట్టాల కింద కింద 612 కేసులను నమోదు కాగా, వివిధ దేశాల నుంచి వచ్చిన 866మందిపై కేసులను నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.