గాయాలతో రక్తమోడుతూ స్ట్రెచర్‌పై బాధితుడు.. ఏసీ వేసుకొని నిద్రపోయిన వైద్యుడు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మీరట్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.

Docetor sleeping
Uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మీరట్ ప్రభుత్వ ఆస్పత్రి అయిన లాలా లజపతి రాయ్ మెమోరియల్ (ఎల్ఎల్ఆర్ఎం) మెడికల్ కాలేజీలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు డాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడంటూ.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో సదరు వైద్యుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సునీల్ (30) తన బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవుతోంది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత 1గంట సమయంలో బంధువులు అతన్ని లాలా లజపతిరాయ్ మెమోరియల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ఏసీ వేసుకొని కుర్చీపై కూర్చొని డేబుల్ పై కాళ్లుపెట్టి హాయిగా నిద్రపోతున్నాడు.
స్ట్రెచర్ పై ఉన్న సునీల్‌కు రోడ్డు ప్రమాదంలో అయిన గాయాల కారణంగా రక్తస్రావం అవుతుంది. అప్పటికే బంధువులు గాయాలైన చోట రక్తస్రావం కాకుండా క్లాతులు కట్టారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన తరువాత అతని పరిస్థితి విషమంగా మారింది. అతనికి తక్షణమే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు వైద్యుడిని వేడుకున్నారు. కానీ, వైద్యుడు భూపేశ్ కుమార్ మాత్రం కుర్చీపై ఏసీకింద హాయిగా నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యలు ఆరోపించారు. అక్కడ ఉన్న ఇతర వైద్య సిబ్బంది వద్దకు వెళ్లి వైద్య అందించాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సరైన సమయంలో చికిత్స అందుకపోవటంతో తీవ్ర రక్తస్రావం అయ్యి చివరికి సునీల్ ప్రాణాలు కోల్పోయాడు.
यह हाल है मेरठ मेडिकल कॉलेज की इमरजेंसी का यहां पर मरीज मरे या जिए डॉक्टर और स्टाफ को कोई मतलब नहीं है वह अपनी नौकरी के घंटे सोकर पूरे करते हैं और महीने के अंत में अपनी मोटी सैलरी लेकर मजे करते हैं।@CMOfficeUP @narendramodi @myogiadityanath pic.twitter.com/xnKV5lJV4u
— Juhi Chauhan (@Juhityagi17) July 28, 2025
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి చికిత్స చేయకుండా నిద్రపోయిన డాక్టర్ భూపేశ్ కుమార్ రాజ్ కు సంబంధించిన వీడియోను మృతుడి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే భూపేశ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌సి గుప్తా మాట్లాడుతూ.. మేము వీడియోను గమనించి వెంటనే డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ను సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యలు కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.