మహా రాజకీయం : మోదీతో శరద్ పవార్ భేటీ

మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్ బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమై చర్చించేదుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పవార్ ఇవాళ కలుసుకోనున్న నేపథ్యంలో దీనికంటే ముందే ఆయన ప్రధాని మోదీని కలుసుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ సమావేశంలో రైతు సమస్యలను పవార్ సారధ్యంలోని ప్రతినిధి బృందం మోదీ దృష్టికి తీసుకురానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలోనే వీరి భేటీ జరగనుంది. మోదీ పవార్ భేటీ లో మహారాష్ట్ర రాజకీయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని శరదపవార్ నిర్ద్వంద్వంగా ఖండించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.