నో తీహార్ జైలు… చిద్దూ సీబీఐ కస్టడీ పొడిగింపు

INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్-5,2019 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే, చిదంబరంను జైలుకు మాత్రం తరలించరాదని స్పష్టం చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టింది. చిదంబరం తరుపున సీనియర్ కాంగ్రెస్ నేత,న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. చిదంబరం వయసును దృష్టిలో ఉంచుకుని.. బెయిల్ మంజూరు చేయాలని.. లేదా హౌజ్ అరెస్ట్ చేయాలని సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప తీహార్ జైలుకు మాత్రం పంపించవద్దని కోరారు.
చిదంబరంను ఎక్కడ విచారించాలన్న విషయాన్ని సీబీఐ కోర్టు తేలుస్తుందని సీబీఐ వాదనలు వినిపించింది. చిదంబరం లాంటి వ్యక్తులను తమ ఆధీనంలో విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ వాదించింది. దీంతో సుప్రీంకోర్టు గురువారం వరకు చిదంబరం కస్టడీని పొడిగించింది. వయసు రీత్యా తీహార్ జైలుకు పంపించవద్దన్న ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది.