బుల్ బుల్ తుఫానుపై ప్రధాని సమీక్ష

  • Published By: chvmurthy ,Published On : November 10, 2019 / 07:38 AM IST
బుల్ బుల్ తుఫానుపై ప్రధాని సమీక్ష

Updated On : November 10, 2019 / 7:38 AM IST

పశ్చిమ బెంగాల్‌, ఒడిషాతో  సహా బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న బుల్‌ బుల్‌ తుఫానుపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రధాని సూచించారు.

పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులు మరియు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా మధ్య ఆదివారం తెల్లవారుజామున 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తీవ్రమైన తుఫాను బుల్బుల్ క్రమంగా బలహీనపడుతోందని కోల్ కతాలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల కోల్‌కతాతోపాటు, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్ల్లీ, హౌరా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని  వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుల్‌బుల్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో ఇద్దరు మరణించారు. 

కోల్‌కతాలో చెట్టుకూలి ఒకరు, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో గోడ కూలి మరొకరు చనిపోయారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధర్మాలో రికార్డుస్థాయిలో గంటలకు 110 కి.మీ వేగంతో గాలులు వీచాయని, కేంద్రపార, జగత్‌సింగ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో భారీగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జీనా తెలిపారు.  ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, కొన్ని పడవలు దెబ్బతిన్నాయన్నారు. సుమారు 4 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.  మరోవైపు బుల్‌బుల్ తుఫాన్ పట్ల బంగ్లాదేశ్ కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముండటంతో ముందు జాగ్రత్తగా 18 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.