రామ జన్మభూమి కేసు: కొత్త ధర్మాసనం ప్రకటించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మొదట ఏర్పాటు చేసిన ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్ స్థానంలో కొత్తగా జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లను తీసుకున్నట్టు ప్రకటించారు. జస్టిస్ యుయు లలిత్ మాత్రం గతంలో అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులో లాయర్‌గా ఉన్నందున తాను ఈ ధర్మాసంలో కొనసాగలేనని తెలిపటంతో ఈ మార్పులు చేశారు.
కొత్తగా వచ్చిన ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి, జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్‌లు సభ్యులుగా ఉంటారు. కాగా జనవరి 29 నుంచి అయోధ్య వివాదంపై ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని పంచుకునే విషయంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు 2018, అక్టోబర్ 29న సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలుచేయగా వారి పిటీషన్లు సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.