కొత్తగా లక్షణుడి పాత్రలో కాంగ్రెస్: అధికారం కోసం సర్ధుబాటు

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావట్లేదు. మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో.. ఘన విజయాలు ఖాయం అనుకున్నా కూడా బొక్కా బోర్లా పడింది బీజేపీ. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ అదే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో 11 చోట్ల విజయం సాధించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారం కోల్పోయింది.
జార్ఖండ్‌లో ఐదు విడతలుగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో.. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి సింపుల్ మెజార్టీతో అధికారం దక్కించుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ సింపుల్ మెజార్టీ అయిన 42 స్థానాలను దాటి 47స్థానాలు దక్కించుకుని జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. ఇందులో కాంగ్రెస్ 16స్థానాల్లో గెలవగా.. జేఎంఎం 30పస్థానాల్లో ఆర్‌జేడీ ఒక్క స్థానంలో గెలిచింది. బీజేపీ కేవలం 25స్థానాలతో సరిపెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసిన తర్వాత ఈ ఫలితాలను చూస్తుంటే బీజేపీ గ్రాఫ్ పడిపోయినట్లుగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో శివసేనతో కలిసి కూటమిగా పోటీ చేసి విజయం సాధించినా అక్కడ చివరకు బీజేపీ లేని కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే మహారాష్ట్రలోనూ.. జార్ఖాండ్‌లోను చిన్న పాత్రనైనా పోషించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయ్యింది. బీజేపీ చట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతటి చిన్న పాత్రనైనా పోషించేందుకు సిద్ధం అవుతుంది. దేశానికి అరిష్టం ప్రాంతీయ పార్టీలే అనే వాదనలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ పార్టీలను బలం చేసేందుకు చిన్న పాత్ర అయినా పర్లేదు పోషించేందుకు సిద్ధం అంటుంది.
కొన్నాళ్లుగా గమనిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రతిచోటా బీజేపీ ప్రతికూల ఫలితాల్నే పొందింది. హర్యానాలో మాత్రమే ఓ ప్రాంతీయ పార్టీ సహకారంతో అధికారం నిలుపుకుంది. ప్రలోభపర్వాలతో కర్నాటకలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం దక్కించుకుంది. అంటే అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోలేదు. ప్రజల ఆదరణ పొందలేక చివరకు అధికారాన్ని కోల్పోయింది బీజేపీ.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే? బీజేపీ అధికారం కోల్పోతుంటే కాంగ్రెస్ బలపడాలి. అయితే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీయో, రాహుల్ గాంధీయో తమ వ్యూహాలకు పదునుపెట్టి బీజేపీని మట్టిగరిపించినట్లు కనిపించట్లేదు. ప్రతిచోటా బీజేపీయే ఓడిపోయింటే.. అక్కడ ప్రాంతీయ పార్టీల బలం కారణం కావచ్చు.. పాలన వైఫల్యాలు కావచ్చు. అయితే ప్రతి చోట కాంగ్రెస్ మాత్రం చిన్నన్న పాత్ర పోషిస్తుంది.
అయితే పనిచేసే అధ్యక్షుడు లేకపోయినా.. ఆర్థిక వనరులు ఇంతకుముందు కన్నా తక్కువగా ఉన్నా.. కాంగ్రెస్ ముక్తభారత్ అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా.. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని ప్రజలు భావిస్తున్నా.. కాంగ్రెస్ బలపడట్లేదు. అయితే బీజేపీని బలహీనం చేయాడానికి మాత్రం ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తుంది కాంగ్రెస్. ప్రత్యర్థిని పడగొట్టాలంటే బలం పెంచుకోవడమే కాదు.. ప్రత్యర్థులను బలహీనం చెయ్యడం కూడా అనే ప్రాథమిక సూత్రాన్ని ప్రస్తుతం కాంగ్రెస్.
మొన్నటి రాజస్థాన్ వసుంధరరాజే దగ్గర్నుంచి ఈరోజు రఘువరదాస్ దాకా… బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలనను అందించలేదా? లేకుంటే బీజేపీనే జనం నమ్మట్లేదా? అనే అనుమానాలు రాక మానవు. అయితే అప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో వచ్చిన అధికార మార్పులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్.. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై పెత్తనం సాధించుకుంది.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకపోతే ఎక్కువ రోజులు మనుగడ సాగించడం కష్టం. జాతీయ పార్టీలు అయితే అవి ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చే నిధులతో మనుగడ సాగిస్తాయి. అయితే జాతీయ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఇంచుమించుగా ప్రాంతీయ పార్టీల పరిస్థితే. ఆర్థికంగా కూడా ఆ పార్టీ చితికిపోయింది. ఇటువంటి సమయంలో రాష్ట్రాల్లో కనీసం వారికి సపోర్ట్ చేసే పార్టీలు ఉంటే కొంత వరకు మనుగడ సాగించవచ్చు అనే ఉద్ధేశ్యంతో ఈ మేరకు చిన్నన్న పాత్రను పోషించేందుకు అయినా సిద్ధం అవుతుంది.