గడ్కరీని మోసేస్తున్న కాంగ్రెస్ : బాగా పని చేస్తాడంటూ సోనియా కితాబు

గడ్కరీని మోసేస్తున్న కాంగ్రెస్ : బాగా పని చేస్తాడంటూ సోనియా కితాబు

Updated On : February 7, 2019 / 12:52 PM IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.. రోడ్డు రవాణాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పొగడ్తలలో ముంచెత్తారు. పార్లమెంట్‌లో నితిన్ ప్రసంగాన్ని విన్న సోనియా గాంధీ సానుకూలం స్పందించారు. చక్కటి పనితీరును కనబరిచిన ఎంపీలను పార్టీలకతీతంగా ప్రశంసించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం బల్లలు చరిచి గడ్కరీ పనితీరును అభినందించారు. 

గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలోని సమస్యల గురించి సోనియాగాంధీ రాసిన లేఖకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారట. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సోనియా ప్రశంసలు కురిపించారు. 

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం నితిన్ గడ్కరీని దమ్మున్న నేతగా అభివర్ణించారు. తాజాగా సోనియాగాంధీ సైతం గడ్కరీ పనితీరుకు సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో పక్కపక్కనే కూర్చున్న నితిన్ గడ్కరీ, రాహుల్ గాంధీ… కొద్దిసేపు ముచ్చటించుకోవడం కనిపించింది. ఆ తరువాతే రాహుల్ గాంధీ గడ్కరీపై ప్రశంసలు కురిపించడం, తాజాగా సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆయన పనితీరును మెచ్చుకోవడం విశేషం.