భార్య తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త

UP Man Beheads Wife : ఇంట్లో భార్యా,భర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన భర్త భార్య తల నరికేశాడు. భార్య తల తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా,నీతానగర్ లో నివసించే చిన్నార్ యాదవ్, విమల(35) దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఈ మధ్య భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న చిన్నార్ యాదవ్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు.
ఈ క్రమంలో అక్టోబర్9, శుక్రవారం ఉదయం గం.7-30 సమయంలో తిరిగి భార్యా భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కోపం పెరిగి పోయిన చిన్నార్ యాదవ్ పదునైన కత్తితో భార్య మెడ కోసేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య తలను మొండెం నుంచి వేరు చేసి, తల తీసుకుని నేరుగా బాబేర్ పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
మహిళ తలను చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నార్ యాదవ్ భార్య తలతో రోడ్డు మీద నడిచి వచ్చే సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్నార్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేపట్టారు.