దుర్గమ్మ భక్తులకు దీదీ వరాలు :ప్రభుత్వం నుంచి కమిటీకి రూ.50వేలు

  • Published By: nagamani ,Published On : September 25, 2020 / 11:55 AM IST
దుర్గమ్మ భక్తులకు దీదీ వరాలు :ప్రభుత్వం నుంచి కమిటీకి రూ.50వేలు

Updated On : September 25, 2020 / 12:24 PM IST

దసరా పండుగ వస్తోంది. దుర్గమ్మ భక్తులు అమ్మవారి పూజకు సిద్ధమవుతున్నారు. దుర్గా పూజ అనగానే మనకు కలకత్తా కాళీ గుర్తుకొస్తుంది. దసరాకు కలకత్తాలో అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దసరా పండుగ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరాలు కురిపించారు. పశ్చిమబెంగాల్లోని 30,000కు పైగా ఉన్న దుర్గ పూజ కమిటీలకు ఒక్కో కమిటీకి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని గురువారం (సెప్టెంబర్ 24,2020)ప్రకటించారు. దీంతో పాటు ఈ సంవత్సరం దుర్గ పూజ నిర్వహించే కమిటీల నుంచి ఫైర్ డిపార్ట్‌మెంట్, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎలాంటి పన్నులు వసూలు చేయరని తెలిపారు.


కాగా..దుర్గ పూజ నిర్వహించే మండపాల వద్ద భద్రత, ఫైర్ సేఫ్టీ లాంటివి కల్పించడానికి పన్నులు వసూలు చేసే పనులు సాక్షాత్తూ ప్రభుత్వ శాఖలే నిర్వహిస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పన్నులు వసూళ్లు ఉండవని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా సమయంలో దుర్గా పూజ మండపాల నిర్వాహకులు ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు.


కరోనా ప్రభావంతో ఉద్యోగాలు..ఉపాధులు పోయి ప్రజలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటిసమయంలో ప్రజలకు మండపాల నిర్వాహకులకు చందాలు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రతి మండపానికి రూ.50,000 చొప్పున సాయం చేస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఈ సాయం..ప్రజలకు కొంతవరకూ ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావించి ఈ ప్రకటన చేసామని తెలిపారు.


రాష్ట్రంలో కరోనా కష్టాలు వచ్చినా.. సంస్కృతి, సంప్రదాయాలను మానివేయకూడదని..ఇటువంటి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ సంప్రదాయాలు ఎప్పటికీ ఉంటాయి. వాటిని పెంపొందించేందుకు ఈ సాయం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 30,000 కమిటీలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున అందిస్తే ప్రభుత్వానికి రూ.140 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు అధికారులు.


దుర్గ పూజ కమిటీలతో సీఎం మమతా బెనర్జీ సమావేశ నిర్వహించారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం కమిటీలకు ఆర్థిక సహాయంతో పాటు ఈ సంవత్సరం దుర్గ పూజ మండపాలకు విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది 25 శాతం రాయితీ కల్పించారు. అంతేకాకుండా కరోనా నిబంధనల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో దీదీసమావేశమయ్యారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. మార్గదర్శకాలను వివరించారు. దీంట్లో భాగంగా..కోవిడ్ 19 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.


ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎమర్జెన్సీ సేవలను ఉచితంగా అందించాలని కూడా కోరామని తెలిపారు. కష్టాల్లో ఉండే ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ దుర్గ పూజ కార్నివాల్ నిర్వహించడం లేదని ప్రకటించారు. కరోనా మహమ్మారి త్వరలోనే అంతం అవుతుందని ఆకాంక్షించిన సీఎం మమతా ‘వచ్చే సంవత్సరం మరింత భారీ ఎత్తున దుర్గ పూజ కార్నివాల్ నిర్వహిస్తామని తెలిపారు.


అలాగే..మండపాల వద్ద పూజలు..ఇతర కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భక్తులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్లు వినియోగించేలా చూడాలన్నారు. తీర్థ ప్రసాదాల వితరణ సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సంప్రదాయాలను పాటించటమే కాదు..కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని సూచించారు.