చంద్రబాబుకి మరో తలనొప్పి.. తెలంగాణ టీడీపీలో అసంతృప్తి సెగలు, కొత్త నాయకుడిని ప్రకటిస్తారా?

l ramana… తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహారం తయారైంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వైఖరిని వ్యతిరేకించే వారు ఎక్కువవుతున్నారు. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని పలువురు సీనియర్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కోరాలని డిసైడ్ అయ్యారు. నిజానికి తెలంగాణలో పార్టీ బలహీనంగా తయారైంది. పార్టీని నిలబెట్టేందుకు అడపా దడపా ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు.
నడిపించే నాయకుడి కోసం ఎదురుచూపులు:
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి సానుభూతిపరులు ఉన్నారు. వారంతా పార్టీని సరైన పద్ధతిలో నడిపించే నాయకుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రమణ వైఖరి పట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పలువురు సీనియర్ నాయకులు. ప్రతి ఎన్నికలోనూ పార్టీ దారుణ పరాజయాలనే మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రమణను తప్పించాలంటూ చంద్రబాబును కోరేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారట. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని అభ్యర్థించాలని భావిస్తున్నారట. ఆ నేతలంతా చంద్రబాబుకు రాసిన లేఖను తొందరలోనే అందించాలని నిర్ణయించారని చెబుతున్నారు.
త్వరలో గ్రేటర్ ఎన్నికలు:
మరోపక్క, గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. సిటీ పరిధిలో పార్టీకి కొంత మేరకు పట్టు ఉందని భావిస్తున్న నేతలు.. ఆలోపే పార్టీ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేసి జోరు పెంచితే నగరంలో పట్టు పెంచుకోవచ్చని అంచనా వేస్తున్నారట. రమణ తీరుపై పలువురు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై రమణ దృష్టి పెట్టడం లేదన్నది పార్టీ నాయకులు ప్రధాన ఆరోపణ.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించగలిగితే మళ్లీ పార్టీలో జోష్ నింపేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. మరోవైపు తనకు వ్యతిరేకంగా లేఖ ఇచ్చిన తర్వాతే స్పందించాలని రమణ అనుకుంటున్నారట. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.