రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా సీఎం జగన్ చొరవ చూపాలని ఆయన కోరారు.
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చేసింది తక్కువ, ఆర్భాటం ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెట్టుబడులు, నిర్మాణాలు పెద్దస్థాయిలో జరగలేదని ఎంపీ
అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిదని జీవీఎల్ హితవు పలికారు. కోడెల మృతిపై రాజకీయం చేయటం తగదని, ఆయన ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు.