కాషాయ కార్యకర్తలకు ఏదీ.. నేతల భరోసా?

కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మరే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోలేక పోతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకున్న తమకు రాష్ట్ర నేతలు కనీస భరోసా కల్పించ లేకపోతున్నారని పార్టీలోని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ బలోపేతానికి నాయకులు ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయాలంటూ ఓ వైపు జాతీయ నాయకత్వం ఆదేశిస్తున్నా రాష్ట్ర నేతలు మాత్రం కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నా వారిని కలిసి, పరామర్శించడం కానీ, భరోసా ఇవ్వడం కానీ చేయడం లేదంటున్నారు.
తెగించి పోటీ చేసినా :
మునిసిపల్ ఎన్నికల్లో అన్నింటికీ తెగించి పోటీ చేసినా.. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే రాష్ట్ర నాయకత్వం తమకు అండగా ఉంటుందన్న నమ్మకం కార్యకర్తల్లో కనిపించడం లేదంట. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజసింగ్‌పై దాడి చేస్తేనే దిక్కులేదని, ఇక తమకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనే అనుమానాలు వారిని వేధిస్తున్నాయట.
దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినా అధికార పార్టీని ఎదురించి నిలబడే ధైర్యం చేయలేకపోతున్నారట. దీనికి తోడు అంతర్గతంగా ఉన్న విభేదాలతో పార్టీ కోసం పని చేస్తున్న వారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కూడా లేకుండా పోయిందంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాముఖ్యత ఇస్తుండటంతో తమ భవిష్యత్ ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొత్తవారికి అవకాశమిచ్చి :
బలం ఉన్న చోట కొత్త వారికి అవకాశం ఇస్తూ పాత వారికి మొండి చేయి చూపిస్తున్నారంటూ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులను కూడా గుర్తించలేని దుస్థితిలో బీజేపీ ఉందంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ తరఫున పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధతలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పడిపోతున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో పార్టీ నాయకత్వం ముందుకొచ్చి కేడర్‌లో భరోసా కల్పించగలిగితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.