రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే…సోనియా మీటింగ్‌లో కాంగ్రెస్ ఎంపీల పట్టు

రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు డిమాండ్ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు పార్టీ ఎంపీలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు తమ విజ్ఞాపనను సోనియాగాంధీ ముందుంచారు.
రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరిన వారిలో కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్, ఎ.ఆంటోనీ, మాణిక్యం ఠాగూర్ (తమిళనాడు), గౌరవ్ గొగోయ్, అబ్దుల్ ఖలేక్ (అసోం), మొహమ్మద్ జావెద్ (బీహార్), సప్తగిరి శంకర్ ఉలేకా (ఒడిశా) తదితరులు ఉన్నారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ సైతం ఈ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే, తనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని ఎంపీలు చేసిన డిమాండ్‌కు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కాగా, గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సైతం శనివారంనాడు ఇదే తరహా డిమాండ్ చేశారు. పార్టీకి రాహుల్ తిరిగి సారథ్యం వహించాలని, పార్టీలోని చిన్నా, పెద్దా అంతా ఆయనకు బాసటగా ఉండేందుకు, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని అన్నారు.
కాగా, సోనియాగాంధీ ప్రస్తుతం తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిని నియమించిన ఏడాది వ్యవధిలో పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. సోనియాగాంధీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 10తో ముగిసిపోతోంది. ఈ సమయంలో రాహుల్ మళ్ళీ రంగంలోకి దిగుతారా లేక సోనియానే మరో ఏడాది కొనసాగిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోబోతుందా అనేది చూడాలి.