ముక్కోణపు పోరు : రంపచోడవరం ఎవరి పరం..?

తూర్పు మన్యం వేడెక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:40 PM IST
ముక్కోణపు పోరు : రంపచోడవరం ఎవరి పరం..?

తూర్పు మన్యం వేడెక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

తూర్పుగోదావరి : తూర్పు మన్యం వేడెక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైసీపీ అభ్యర్ధి ఖరారు దాదాపు పూర్తైనట్లే కనిపిస్తోంది. టీడీపీని మాత్రం వర్గపోరు వేధిస్తోంది. ఇప్పటికే వైసీపీకి కంచుకోటైన ఈ నియోజకవర్గం.. అధికార టీడీపీకి మాత్రం వరుస ఓటములను బహుమానంగా ఇస్తోంది. ఇప్పుడు జనసేన బలపరుస్తున్న కామ్రేడ్స్‌ కూడా మేముసైతం అంటున్నారు. 

రంపచోడవరం విస్తీర్ణం రీత్యా అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 4మండలాలు ఏపీలో కలిశాయి. వీటిని రంపచోడవరం పరిధిలో చేరుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో 7 మండలాల పరిధిలోని ఈ స్థానం ఇప్పుడు 11మండలాలకు విస్తరించింది. ఏటపాక నుంచి రాజవొమ్మంగి వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సీటులో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారమే పెద్ద ప్రహసనంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ్నుంచి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వంతల రాజేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ప్రస్తుత రాజకీయ పరిణామాలతో.. వచ్చే ఎన్నికల్లో వంతల రాజేశ్వరికి మళ్ళీ అవకాశం దక్కుతుందా  అన్నది అనుమానమేనంటున్నారు విశ్లేషకులు. అటు టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్ కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. విలీన మండలాలకు చెందిన ఫణీశ్వరమ్మతో పాటు పలువురు కొత్త నేతలు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. వారిలో చంద్రబాబు ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎవరికి టికెట్ దక్కినా మిగిలిన నేతలు కలిసి పనిచేస్తారనే ధీమా కనిపించడం లేదు. దీంతో అధికార పార్టీపై వర్గపోరు పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందంటున్నారు. 

వైసీపీ అభ్యర్ధి దాదాపు ఖరారైనట్లేనని భావిస్తున్నారు. ఉపాధ్యాయరాలిగా పనిచేసి విఅరెఎస్ తీసుకున్న నాగులపల్లి ధనలక్ష్మికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ సీటుగా భావిస్తున్న వైసీపీ పట్టు నిలుపుకునేందుకు గట్టిగా శ్రమిస్తోంది. కానీ ఆ పార్టీ నేత అనంత ఉదయ భాస్కర్ మీద ఉన్న వ్యతిరేకత ఈమెకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానంలో గెలిచిన ఎమ్మెల్యేని గుప్పిట్లో పెట్టుకుని ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న గిరిజనులు గుర్రుగా ఉన్నారు. ఇక నాన్ ట్రైబ్స్ లో జనసేన కారణంగా వైసీపీ ఆశలకు గండిపడడం ఖాయమంటున్నారు. ఈ సీటులో జనసేన తన మిత్రపక్షాలుగా ఉన్న కామ్రేడ్స్ ని బలపరుస్తోంది. సీపీఎం తరుపున సున్నం రాజయ్య పోటీ చేసే అవకాశం  కనిపిస్తోంది. చింతూరు ప్రాంతంలో సొంత బలం, జనసేన బలం తోడైతే తిరుగుండదని భావిస్తున్నారు. కానీ రంపచోడవరం డివిజన్ పరిధిలో బలహీనంగా ఉండడం మైనస్‌గా చెప్పొచ్చు. 

ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే.. ఈసారైనా విజయం సాధించాలని టీడీపీ పట్టుదలగా ఉంది. మధ్యలో జనసేన బలపరుస్తున్న కామ్రేడ్స్‌ కూడా బలం పుంజుకుంటున్నారు. దీంతో ఈ సారి రంపచోడవరంలో ముక్కోణపు సమరం తప్పేలా లేదు. ఏ పార్టీ ఎవరికి టిక్కెట్‌ ఇస్తుందో.. ఎవరిని గిరిజనులు అక్కున చేర్చుకుంటారో చూడాలి.