కాంగ్రెస్‌కు మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆమె గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో ఆమె సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. ఏప్రిల్ 3న కేసీఆర్ నర్సాపూర్ సభలో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ సీనియర్, కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటం కాంగ్రెస్ నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. వలసలు ఆపడం ఎలానో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
మెదక్ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన డీకే అరుణ.. 2 రోజుల క్రితం సునీతా లక్ష్మారెడ్డి ఇంటికెళ్లి చర్చలు జరిపారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. వారి ప్రతిపాదనను తిరస్కరించిన సునీతా.. తాను బీజేపీలో చేరను అని స్పష్టంగా చెప్పారు. అధికార టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 4న నర్సాపూర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.