నాన్నగారి పుట్టినరోజున రైతు దినోత్సవం.. వైఎస్ జగన్

వైఎస్సార్ పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి రైతుల గురించి ఎంతో ఆలోచన చేశారు? రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారా? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకుని ఆ గౌరవం మనం ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 2004లో నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కరెంటు బకాయిలను రద్దుచేస్తూ తొలి సంతకం చేశారు. ఆరోజుల్లో దీని విలువ రూ.1200 కోట్లు వరకు ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుమీద తొలిసంతకం చేశారన్నారు. ప్రతిరైతుకూ సంవత్సరానికి రూ.50వేల మేర మేలు జరుగుతోందని చెప్పారు. గంటకు 5 యూనిట్లు చొప్పున 7 నుంచి 9 గంటల పాటు వేసుకున్నా 35 నుంచి 45 యూనిట్లు రోజుకు రైతుకు కరెంటు ఉచితంగా లభిస్తోందని తెలిపారు. 150 రోజులు వేసుకున్నా లెక్కలు వేసుకుంటే.. ప్రతి రైతుకు రూ.50వేల పైచిలుకు రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు.
దీనికి ఎవరు శ్రీకారం చుట్టారంటే.. 2004లో దివంగత నేత వైఎస్సార్ గుర్తుకు వస్తారని జగన్ చెప్పారు. ఉచిత విద్యుత్ మీద ఆయన తొలిసంతకం చేశారని, అప్పట్లో ఎన్నికల్లో వైఎస్ఆర్ హామీ ఇస్తే… అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఉచిత కరెంటు ఇస్తే కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చులకనగా మాట్లాడారని చెప్పారు.
అప్పుడు ప్రారంభమైన ఆప్రయాణం 108, 104, ఫీజు రియంబర్స్‌మెంట్, జలయజ్ఞం గుర్తుకు వస్తుందన్నారు.
వైఎస్సార్ పాలన అంటే ప్రతిఒక్కరికి ఇవే గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా రైతులకోసం రైతు దినోత్సవం చేసుకుంటున్నామని చెప్పారు. మన అందరి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. గత ఐదేళ్లుగా.. వడ్డీలేని రుణాలకు గ్రహణం పెట్టిందన్నారు. వడ్డీలేని రుణాలకోసం చెల్లింపులు చేయకుండా బాధ్యతను విస్మరించిందని విమర్శించారు.
రూ.1150 కోట్లు బకాయిలగా పెట్టిందని, దాదాపు 57 లక్షలమంది రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈచెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ బాధ్యతను ఏరోజూ సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. కట్టామంటే.. కట్టాం అన్నట్టుగా కడుతూ రైతులను మోసం చేసిన పరిస్థితులు కనిపించాయని మండిపడ్డారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో ఎలా చేశామో…. సున్నావడ్డీ బకాయిలు పూర్తిగా సున్నా చేసేస్తున్నామని సీఎం జగన స్పష్టం చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే చెల్లిస్తున్నామని,
రైతులు సకాలంలో చెల్లిస్తే… సున్నాడబ్బులు తిరిగి వస్తాయన్నారు. ఇకపై సున్నా వడ్డీ డబ్బులు రైతుల అక్కౌంట్లోకే వేస్తున్నామని చెప్పారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. అదే ఏడాది వారి బ్యాంకు అకౌంట్లలో చెల్లిస్తున్నామని తెలిపారు.
దాదాపు రూ. 1150 కోట్లు, 57 లక్షలమంది రైతుల అక్కౌంట్లలో వేస్తున్నామని తెలిపారు. 2019–20కి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన, ఖరీఫ్‌కు సంబంధించి సున్నావడ్డీ అక్టోబరు నాటికినేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేయించే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అలాగే 2019–20 రబీ నాటికి సంబంధించి మార్చినాటికి రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని తెలిపారు. పారదర్శకతను పై స్థాయికి తీసుకెళ్తున్నామని చెప్పారు.
గతంలో ఎప్పుడూ కూడా సున్నా వడ్డీకింద చెల్లింపులు రైతుల అక్కౌంట్లలోకి వేయలేదని, ఇప్పుడు మనం చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రభుత్వం పెట్టిన బకాయిలు కాబట్టి.. రైతుల వివరాలను సేకరించి… వారికి చెల్లింపులు చేస్తున్నామని,
అందువల్ల అందరికీ ఒకేరోజున కాకుండా.. క్రమంగా చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క నాలుగు రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వాలని కోరారు. ఒకవేళ అప్పటికీ కూడా రాకపోతే 1907 నంబర్‌కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చునని సీఎం జగన్ సూచించారు.