Karnataka CM: ఢిల్లీ చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇంకా పిలుపు రాలేదన్న డీకే
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను డీకే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 135 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సీఎంను నియమించే విషయం పార్టీ హైకమాండ్‌కి ఇచ్చారని అన్న ఆయన కర్ణాటకను కాంగ్రెస్‌కి అందించడమే తన లక్ష్యమని, తాను ఆ పని పూర్తి చేశానని, తనకంటూ ప్రత్యేక సంఖ్యాబలమేదీ లేదని చెప్పారు.

Siddaramaiah (file photo)
DK vs Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) పదవి రేసు జోరుగా సాగుతోంది. ఈ రేసు మాజీ సీఎం సిద్ధారమయ్య (Siddaramaiah), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించనున్నారు. ఇక సీఎం రేసులో ఉన్న డీకేకు ఢిల్లీ నుంచి ఇంకా పిలుపే రాలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే సోమవారం తాను ఢిల్లీకి వెళ్లే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు.
దీనికి తోడు ఈరోజు డీకే పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను తన ఆత్మీయులను కలుసుకుంటున్నానని, వారిని కలిసిన అనంతరం ఢిల్లీకి వెళ్తానని తెలిపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనకే మద్దతుగా ఉన్నారంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను డీకే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 135 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సీఎంను నియమించే విషయం పార్టీ హైకమాండ్‌కి ఇచ్చారని అన్న ఆయన కర్ణాటకను కాంగ్రెస్‌కి అందించడమే తన లక్ష్యమని, తాను ఆ పని పూర్తి చేశానని, తనకంటూ ప్రత్యేక సంఖ్యాబలమేదీ లేదని చెప్పారు.
Karnataka CM: ఢిల్లీ చేరుకున్న పరిశీలకులు.. కర్ణాటక సీఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గేకు నివేదిక
అయితే ముఖ్యమంత్రి పదవిపై సిద్ధారమయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి రెండేళ్లు తాను సీఎంగా ఉంటానని, అనంతరం మూడేళ్లు డీకేకు ఇవ్వాలని సిద్ధరామయ్య సూచించారట. అయితే సిద్ధరామయ్య పెట్టిన ప్రతిపాదనకు డీకే శివకుమార్ నో చెప్పారు. రాజస్థాన్ వంటి పరిణామాలు కర్ణాటకలో కూడా చోటు చేసుకుంటాయని డీకే ఆందోళన చెందుతున్నారట. అయితే సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదనకు మాత్రం రివర్సులో డీకే ఆమోదించారు. మొదటి మూడు సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత రెండేళ్లు సిద్ధరామయ్యకు ఇవ్వాలని డీకే అభిప్రాయపడ్డారట.