అయోధ్యలో గంభీర వాతావరణం : 144 సెక్షన్..భారీ బందోబస్తు

అయోధ్యలో గంభీర వాతావరణం నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. జస్టిస్ ఎస్.ఎ బొబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.ఎ. నజీర్‌లు ధర్మాసనంలో ఉన్నారు.
ఈ క్రమంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వీలుగా పారామిలటరీ బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు. డిసెంబరు 10వ తేదీ వరకు అయోధ్య నగరంలో 144 సెక్షన్ ఉత్తర్వులు విధించారు. వివాదాస్పద స్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పౌరుల భద్రత కోసం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అణువణువునా భద్రత కట్టుదిట్టం చేశారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 4 వేల పారా మిలటరీ దళాలు, బాంబ్ స్క్వాడ్స్‌ని తరలించారు. మొత్తం 12 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు.
వీరికి అదనంగా 16 వేల మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. యూపీలో 24 గంటలు పనిచేసే మాస్టర్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. 20 తాత్కాలిక జైళ్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. భద్రతను మరింత పటిష్టం చేయాలని 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. యూపీ అధికారులతో సీజేఐ గొగోయ్ సమీక్ష జరిపారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తె అవకాశముందన్న అంచనాలతో తగిన చర్యలు తీసుకుంటున్నారు.
యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో 8 కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా మలిచారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), స్థానిక నిఘా విభాగం (ఎల్ఐయూ) దళాలను మోహరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసు, పరిపాలన అధికారుల సెలవులను రద్దు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాలకు సంబంధించి అధికారుల సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అయోధ్య వాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు తరువాత ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నిత్యావసర వస్తువులను తీసుకొని పిల్లలు, మహిళలను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.