ఆఖరి రోజు : హుజూర్‌నగర్‌లో మూగబోనున్న మైకులు

హుజూర్‌నగర్‌లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 02:43 AM IST
ఆఖరి రోజు : హుజూర్‌నగర్‌లో మూగబోనున్న మైకులు

Updated On : October 19, 2019 / 2:43 AM IST

హుజూర్‌నగర్‌లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే

హుజూర్‌నగర్‌లో శనివారంతో(అక్టోబర్ 19,2019) పొలిటికల్ మైకులు బంద్ కానున్నాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియనుంది. ఇక.. ఎన్నికకు మరో రెండు రోజులే మిగిలివుంది. గెలుపే లక్ష్యంగా ఇప్పటివరకు  ప్రచారంలో జోరు చూపించిన అన్ని పార్టీలు… ఆఖరిరోజు కావడంతో మరింత హోరెత్తించనున్నాయి.

అక్టోబర్ 21న పోలింగ్ జరిగే హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ఇవాళ్టితో ఎండ్ కార్డ్‌ పడనుంది. సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు ఈ  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు అక్కడే మకాం వేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ  కేసీఆర్ కూడా ప్రచారం చేయాలనుకున్నా… వాతావరణం అనుకూలించకపోవడంతో సభ రద్దయింది.

అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో ప్రచార బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌… ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తుండగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరో  విజయం కోసం చెమటోడుస్తోంది. మరోవైపు ఉప పోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  

కాంగ్రెస్ నుండి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న టీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించిన సంక్షేమ పథకాలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలనే  నమ్ముకుంది. ప్రధానంగా తమ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తోంది. 

ఇటు… కాంగ్రెస్‌ పార్టీ తమ హయాంలో నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లడిగే ప్రయత్నం చేస్తోంది. తమ హయాంలోనే నియెజకవర్గం అభివృద్ధి చెందిందని ఓటర్లకు గుర్తుచేస్తోంది. గతంలో  తాము చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. 

మరోవైపు.. బీజేపీ, టీడీపీ అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే… వీరి గెలుపోటములను పక్కనపెడితే వారికి వచ్చే ఓట్ల వల్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరికి లాభం, ఎవరికి  నష్టమన్న అంశంపై ఇపుడు చర్చ జరుగుతోంది.