రాధా యూ టర్న్ : టీడీపీలో చేరనని ప్రకటన

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 07:44 AM IST
రాధా యూ టర్న్ : టీడీపీలో చేరనని ప్రకటన

విజయవాడ : సస్పెన్స్‌ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. వంగవీటి రాధా సంచలన ప్రకటన చేశారు. అన్యూహంగా యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీలో చేరడం లేదని వంగవీటి రాధా తేల్చి చెప్పారు. రాధా-రంగా మిత్రమండలి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించారు. రంగా కుటుంబం ఓ వ్యవస్థ అని గుర్తించి తనను టీడీపీలోకి ఆహ్వానించినందుకు చంద్రబాబుకి రాధా కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాను టీడీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. పెద్ద మనసుతో తనను మన్నించాలని చంద్రబాబుని కోరారు. టీడీపీలో చేరనందుకు చంద్రబాబు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు రాధా చెప్పారు. అన్ని పార్టీలు, కులాల్లో రంగా అభిమానులు ఉన్నారని రాధా అన్నారు. తనకు పదవులు అవసరం లేదన్న రాధా.. తన తండ్రి ఆశయాలే తనకు ముఖ్యం అన్నారు.

 

తన తండ్రి వంగవీటి రంగా హత్య గురించి కూడా రాధా కీలక వ్యాఖ్యలు చేశారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దాన్ని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. ఓ వ్యక్తి చేసిన తప్పుకి అందరిని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. రంగా హత్యను టీడీపీపై రుద్దడం తమ పొరపాటే అన్నారు. వ్యక్తులు చేసిన దానిని పార్టీకి ఆపాదించినందుకు బాధపడుతున్నామన్నారు. రంగాకు కాపు ముద్ర వేయొద్దని, అన్ని పార్టీల్లో ఆయన అభిమానులు ఉన్నారని రాధా చెప్పారు.

 

తనకు సీటు ఇవ్వనందుకు బాధ లేదన్న రాధా.. సూటి పోటి మాటలు అన్నందుకే చాలా బాధపడ్డానని చెప్పారు. యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకురమ్మంటే తీసుకొచ్చానని, ఆయనకు ఇచ్చిన సీటు నుంచి నన్ను పోటీ చేయమంటే ఎలా? అని రాధా ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి సేవ చేయడానికి నన్ను పార్టీలోకి రమ్మన్నారు, నేను ఆలోచించేలోపే నాపై సోషల్ మీడియాలో దాడి చేశారని రాధా మండిపడ్డారు.