నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు.. కవిత గెలుపు నల్లేరు మీద నడకే అని తెలిసినా బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తున్నాయి?

nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడుతోన్న బీజేపీ, కాంగ్రెస్‌కు శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో మరోసారి ఓటమి ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. పేరుకు జాతీయ పార్టీలైనప్పటికీ స్థానిక సంస్థల్లో కనీస బలాన్ని కైవసం చేసుకోలేకపోయాయి.
ఉనికి కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ:
2019లో వరుసగా జరిగిన స్థానిక పోరులో టీఆర్‌ఎస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలకు సంఖ్యా బలం లేదు. 2018 ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి 2020లో ముగిసిన మున్సిపాలిటీ పోరు వరకు అన్నింటా టీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ పరాజయాన్ని పొందింది. ఉమ్మడి జిల్లాలో ప్రాభవాన్ని కోల్పోతున్నా తమ ఉనికిని చాటుకోవడం కొసమే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయని అంటున్నారు.
టీఆర్ఎస్‌కే మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులు:
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్‌కే మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉప ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. సంఖ్యాపరంగా చూస్తే టీఆర్ఎస్ బలంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులుగా గెలిచిన కొందరు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు.
అయినా తాము కూడా ఉన్నామని చాటుకోవడానికే కాంగ్రెస్, బీజేపీలు బరిలో నిలుస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు ఎందుకు పోటీ చేస్తున్నాయన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నాయని అంటున్నారు.