Telangana Ministers : కవిత తెలంగాణ పరువు తీశారు, కేసీఆర్ కుటుంబం దోచుకున్న ప్రజాధనం కక్కిస్తాం- మంత్రులు ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్.

Telangana Ministers : కవిత తెలంగాణ పరువు తీశారు, కేసీఆర్ కుటుంబం దోచుకున్న ప్రజాధనం కక్కిస్తాం- మంత్రులు ఫైర్

Ministers Uttam Kumar Reddy, Komati Reddy Venkat Reddy

Telangana Ministers : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నారు. ఆ పార్టీ నాయకులను తిట్టడం కూడా టైమ్ వేస్ట్ అని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న ప్రజాధనం మొత్తాన్ని కక్కిస్తామన్నారు మంత్రులు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎన్ఎస్ పీ క్యాంప్ గ్రౌండ్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్:
ఈ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని బాధలు పడ్డారో వ్యక్తిగతంగా చూశాను. మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారు. అందుకే నేను ఎక్కడికి పోయినా మెచ్చుకుంటాను. గతంలో మిర్యాలగూడలో ఎమ్మెల్యేలు లేకున్నా వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మీరు చేసిన త్యాగం మర్చిపోదు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్. బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను చూసి ప్రజలే బొంద పెట్టారు. జనం మనసులో నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగిపోయింది.

బీజేపీ తెలంగాణలో కొత్త నాటకాలకు తెరలేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. గిరిజన విశ్వవిద్యాలయాలు ఆంధ్రకు కేటాయించిన బిజెపి.. తెలంగాణకు ఎందుకు కేటాయించ లేదు? పార్లమెంటు సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ విస్మరించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో బిజెపి పూర్తిగా విఫలమైంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని విచ్చిన్నం చేసింది మోడీ ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అన్ని వ్యవస్థలకు బిజెపి ప్రమాదకరం. రఘువీర్ రెడ్డి నాకంటే మెరుగైన పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి. పౌరసరఫరాల మంత్రిగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అండగా నిలిచాను. పీడీఎస్ బియ్యంతో ఎవరైనా అక్రమ వ్యాపారం చేస్తే సహించేది లేదు.

ఎన్నికల అనంతరం మిర్యాలగూడలో మీరు చెప్పిన ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తాం. నేను మంత్రి కోమటిరెడ్డితో కలిసి మిర్యాలగూడను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. భారీ మెజార్టీతో మా మిత్రుడు, మా తమ్ముడు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా. ప్రతి బూత్ లో ఎంత మెజార్టీ వస్తుందో మేమందరం పర్యవేక్షిస్తాం. అందరం మంత్రులం ఒక టీంగా పని చేసి రాష్ట్రాన్ని కనీవిని ఎరుగని రీతిలో ముందుకు తీసుకుపోతున్నాం.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్..
ఆసియాలోనే నెంబర్ వన్ బిజినెస్ సెంటర్ మిర్యాలగూడకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా. నేను కేసీఆర్ ల దొంగ దీక్షలు చేయలేదు. మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం దీక్ష చేశా. కూతురు జైలుకు పోవడంతో అయ్య కొడుకులకు మతిభ్రమించింది. సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతారని కేసీఆర్, కేటీఆర్ లు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. బతుకమ్మ చాటున మద్యం బాటిళ్ల వ్యాపారం చేసి కవిత తెలంగాణ పరువు తీశారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అక్రమంగా దోచుకున్న ప్రజాధనాన్ని మొత్తం కక్కిస్తాం.

Also Read : రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ