సచిన్ పైలట్ కు ఊరట…స్పీకర్ కు హైకోర్టు ఆదేశం

రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
సచిన్ పైలట్ తరపున న్యాయవాది ముకుల్ రోహద్గీ వాదిస్తూ… పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ జోషి అత్యుత్సాహం ప్రదర్శించారని కోర్టులో వాదించారు. పైలట్‌తో పాటు మరో 18 మందికి నోటీసులు జారీ చేసే సమయంలో స్పీకర్ ఎలాంటి కారణాలు చూపకుండానే నోటీసులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి… వాటిపై స్పందనకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారని, దీన్ని బట్టే అర్థమైపోతుందని రోహత్గీ వాదించారు. వాదనలు విన్న కోర్టు శుక్రవారం(జులై-24,2020) వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పీకర్‌ను ఆదేశించింది.
కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసన సభా పక్షం నిర్వహించిన రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దీంతో సచిన్ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరణపై స్పీకర్ సీపీ జోషి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, వీటిని సవాల్ చేస్తూ తిరుగుబాటు దారు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.