Makar Sankranti 2024: పశువులే ప్రాణం: కనుమ రోజు ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో తెలుసా?

దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే..

Makar Sankranti 2024: పశువులే ప్రాణం: కనుమ రోజు ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో తెలుసా?

Makar Sankranti 2024

Updated On : January 11, 2024 / 7:34 PM IST

సంక్రాంతి పండగ సందడి ప్రారంభం కానుంది. భోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కనుమ రోజు రైతుల జీవితంలో భాగమైన పశువులను పూజిస్తారు.

వ్యవసాయంలో రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువుల కోసం ఈ కనుమ జరుపుకుంటారు. వ్యవసాయ దారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా పంట చేతికి వస్తుంది. దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు ఉంచబడింది.

అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైనదన్నమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండింపచేసే భగవంతుడికి పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీనిని జరుపుకుటాంరు. కనుమ నాడు మినుములు తినాలనేది ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజున గారెలు, ఆవడలు చేసుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కానివారు మాంసకృతులు ఎక్కువగా ఉన్న మినుము గారెలు తింటారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెలన్నీ సందడిగా మారతాయి. ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి ఆనందంగా పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో భాగమైన కోడి, పొట్టేళ్ల పందాలు జోరుగా జరుగుతాయి. ఈ పోటీలను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివస్తారు.

Makar Sankranti 2024: పిండి వంటలు చేసుకుంటున్నారా? చెక్కలు, నెలవంకలు ఇలా చేయండి..