మ్యాచ్ గెలిచి వినూత్నంగా సంబరాలు చేసుకున్న ధోనీ, కోహ్లీ

మ్యాచ్ గెలిచి వినూత్నంగా సంబరాలు చేసుకున్న ధోనీ, కోహ్లీ

విజయవంతంగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం న్యూజిలాండ్ గడ్డపై మొదలైన వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. భారత బౌలర్లు విజృంభించిన వేళ కివీస్ విలవిలలాడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. సెగ్ వేపై చక్కర్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

 

పోస్టు చేసిన అనంతరం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో భారత క్రికెట్ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. సెగ్వేపై ప్రయాణించిన ధోనీ కూల్ నెస్‌తో కనిపించగా, కోహ్లీ తనదైన పార్టీ మూడ్‌లో ఉత్సాహంగా పార్టీ మూడ్‌లోనే చక్కర్లు కొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38ఓవర్లు పూర్తికాకుండానే 157పరుగులు చేసి ఆలౌట్ అయింది. కివీస్ బ్యాట్స్‌మెన్ అంతా నిరాశపరచగా కేవలం కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే 64 పరుగులు చేశాడు. 

 

158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్ కేవలం 2వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలో విజయాన్ని చేజిక్కుంచుకుంది. మ్యాచ్ మధ్యలో ఎండతీవ్రత ఎక్కువగా ఉందని కాసేపటి వరకూ మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డక్ వర్త్ లూయీస్ ప్రకారం 49 ఓవర్లలో 156 పరుగులు చేయాలని లక్ష్యాన్ని కుదించారు. భారత్ బ్యాటింగ్‌లో ధావన్ 75 పరుగులతో హై స్కోరర్‌గా నిలిచాడు.