టీమిండియా ప్లేయర్లు కావాలంటే ఔట్ చేసుకో.. బంతితో కొట్టకు అనే వాళ్లు: షోయబ్ అక్తర్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ మరోసారి టీమిండియా ప్లేయర్లపై నోరు పారేసుకున్నాడు. అతని బౌలింగ్ దురుసుతనాన్ని గొప్పగా చెప్పుకుంటూ అప్పటి బ్యాట్స్‌మెన్‌పై చులకన వైఖరి ప్రదర్శించాడు. కావాలంటే ఔట్ చేసుకోగానీ, బంతితో కొట్టకు అని రిక్వెస్ట్ చేసేవారని అన్నాడు. కొద్ది నెలలుగా తన అభిప్రాయాలను యూట్యూబ్ వేదికగా పంచుకుంటున్న అక్తర్.. తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత సవేరా పాషాతో క్రిక్‌కాస్ట్ అనే యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.
ఒకసారి ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా, గ్లిష్ బ్యాట్స్‌మన్ వద్దని చెప్పినా తనతో బౌలింగ్ వేయించుకొని గాయపడ్డాడని తెలిపాడు. ‘చీకటి పడుతుందని వద్దని చెప్పినా అతడు వినలేదు. చేసేది లేక నేనొక బంతి విసిరా. అతడి దవడకు తగిలి గాయమైంది. వెంటనే అతడు వికెట్లమీదే పడిపోయాడు. అలా పడిపోయేసరికి చనిపోయాడని అనుకున్నా. అలాంటి ఘటనలు చాలా జరిగాయి, అవి జరిగినప్పుడల్లా బాధపడేవాడిని’
‘దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్ కూడా ఒకసారి నా బౌలింగ్‌తో దెబ్బ తగిలించుకున్నాడు. నన్ను కలిసినప్పుడల్లా అతడి కంటి కింద ఉండే గాయం మరకను చూపిస్తాడు’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా టెయిలెండర్లపై కామెంట్ చేశాడు.
‘కావాలంటే మమ్మల్ని ఔట్ చేసుకో.. కానీ, బంతితో విసిరి కొట్టకు. ఎందుకంటే నీ బంతులు చాలా గట్టిగా తగులుతాయి. మాకు భార్యాపిల్లలు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు చూస్తే బాధపడతారు’ అని తనతో అనేవారని చెప్పాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా అంతేనని చెప్పుకొచ్చాడు. షోయబ్ బౌలింగ్ వేస్తే ఆడకుండా పక్కకు తప్పుకునేవాడని చెప్పుకొచ్చాడు.