T20 World Cup: హైదరాబాద్‌కు చోటు.. పాకిస్తాన్ మ్యాచ్‌లు ఢిల్లీలో.. ఫైనల్ మోడీ స్టేడియంలో!

T20 World Cup: హైదరాబాద్‌కు చోటు.. పాకిస్తాన్ మ్యాచ్‌లు ఢిల్లీలో.. ఫైనల్ మోడీ స్టేడియంలో!

Pakistans Games In Delhi Ahmedabad May Host Final

Updated On : April 18, 2021 / 7:22 AM IST

2021 T20 World Cup: అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరగబోయే 2021 టీ20 ప్రపంచ కప్‌ కోసం మొత్తం తొమ్మిది వేదికలను ఎంపికచేసింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ). హైదరాబాద్‌తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగరాలు ఇందులో ఉండగా.. 2016 టీ20 ప్రపంచకప్‌కు వేదికలుగా ఉన్న మొహాలీ, నాగ్‌పూర్‌లకు మాత్రం చోటు దక్కలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ జరగబోతుంది. ముఖ్యంగా ఢిల్లీ పాకిస్థాన్‌ ఆడబోయే రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వివరాలు ఇంకా ధృవీకరించబడనప్పటికీ, రాబోయే మెగా టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరియు మీడియాకు వీసాలకు సంబంధించి బోర్డు హామీ ఇచ్చిందని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) తన క్రికెట్ జట్టుకు మరియు మీడియాకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా వీసాలు డిమాండ్ చేయడంతో పాకిస్తాన్ పాల్గొనే విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది. అహ్మదాబాద్‌లోని 1.1 లక్షల సామర్థ్యం గల నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వగా, సెమీ ఫైనల్‌కు ముంబై, కోల్‌కతాలను గుర్తించారు. నాకౌట్ మ్యాచ్ నిర్వహించడానికి ధర్మశాల కేటాయించబడింది.

పాపువా న్యూ గినియా, నెదర్లాండ్స్, ఒమన్, స్కాట్లాండ్, నమీబియా సహా పదహారు జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటూ ఉండగా.. టోర్నమెంట్‌లో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అక్టోబర్ నాటికి కరోనా పరిస్థితులు ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంటే మాత్రం.. 9 వేదికల మధ్య టోర్నీలో పాల్గొనే జట్లు ప్రయాణించడానికి సౌకర్యంగా ఉండదు కాబట్టి.. ప్లాన్‌ ‘బి’లో భాగంగా నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది.