రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన భార‌త క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల పాటు ఆడి..

టీమ్ఇండియా క్రికెట‌ర్‌, జార్ఖండ్ ఆట‌గాడు సౌర‌భ్ తివారీ ప్రొఫెష‌న‌ల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన భార‌త క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల పాటు ఆడి..

Saurabh Tiwary

Saurabh Tiwary : టీమ్ఇండియా క్రికెట‌ర్‌, జార్ఖండ్ ఆట‌గాడు సౌర‌భ్ తివారీ ప్రొఫెష‌న‌ల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. 34 ఏళ్ల ఈ క్రికెట‌ర్ ప్ర‌స్తుతం రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. త‌న సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 15న జంషెడ్‌పూర్‌తో త‌న ఆఖ‌రి మ్యాచ్‌ను ఆడ‌నున్నాడు.

తివారీ 11 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2006-07 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అతను 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టోర్నమెంట్ గెలిచిన అండర్-19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. ఐపీఎల్‌లో 2010లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఆ సీజ‌న్‌లో 419 ప‌రుగుల‌తో రాణించాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో అత‌డికి టీమ్ఇండియాలో చోటు ద‌క్కించింది. మొత్తంగా టీమ్ఇండియా త‌రుపున మూడు వ‌న్డే మ్యాచులు మాత్ర‌మే ఆడిన తివారీ 49 ప‌రుగులు చేశాడు.

IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు.. భార‌త్‌కు మ‌రో షాక్‌..!

17 ఏళ్లలో కెరీర్‌లో 115 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 189 ఇన్నింగ్స్‌లలో 47.51 సగటుతో 8030 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 34 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అదే జార్ఖండ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హించిన ఎంఎస్ ధోని కంటే ఎక్కువ ప‌రుగులు చేయ‌డం విశేషం. ఎంఎస్ ధోని 131 మ్యాచుల్లో 7038 పరుగులు చేశాడు.

సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో తివారీ మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లోనే ప్రారంభమైన ప్రయాణానికి వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదన్నాడు. అయితే.. వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయం అని అన్నాడు. జాతీయ జ‌ట్టులో లేదా ఐపీఎల్‌లో ఆడ‌కుంటే క్రికెట్ ఆడి ఉప‌యోగం లేద‌న్నాడు. టెస్టు జట్టులో యువకులకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లుగా చెప్పాడు.

Ranji Trophy 2024 : ఇలాంటి మ్యాచుల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌రా..? బీసీసీఐ పై అభిమానుల మండిపాటు

త‌న‌ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నాడు. రంజీల్లో, గ‌త దేశ‌వాలీ సీజ‌న్‌లో తన రికార్డుల‌ను ఓ సారి చూడాల‌న్నాడు. ఆట‌కు వీడ్కోలు త‌రువాత ఏం చేస్తార‌ని అడుగ‌గా.. ప్ర‌స్తుతానికి త‌న‌కు క్రికెట్ ఒక్క‌టే తెలుస‌న్నాడు. ఆట‌కు క‌నెక్ట్ కాబోతున్న‌ట్లు చెప్పాడు. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, అయితే.. దాని గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఆలోచించ‌లేద‌న్నాడు.

ఐపీఎల్‌లో నాలుగు జ‌ట్ల త‌రుపున మొత్తం 93 మ్యాచులు ఆడాడు. 28.73 సగటుతో 120 స్ట్రైక్ రేట్‌తో 1494 పరుగులు చేశాడు.