IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. ప్రాక్టీస్‌లో సూర్యకుమార్‌కు తీవ్ర గాయం.. ఇషాన్‌ను కుట్టిన తేనటీగ..!

ఆదివారం న్యూజిలాండ్‌తో కీల‌క పోరుకు టీమ్ఇండియా సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు అన్ని అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి.

IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. ప్రాక్టీస్‌లో సూర్యకుమార్‌కు  తీవ్ర గాయం.. ఇషాన్‌ను కుట్టిన తేనటీగ..!

IND vs NZ

Updated On : October 21, 2023 / 9:28 PM IST

India vs New Zealand : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకువెలుతోంది టీమ్ఇండియా. ఆదివారం న్యూజిలాండ్‌తో కీల‌క పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు అన్ని అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయ‌ప‌డిన హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌ల‌కు ఇప్ప‌టికే దూరం అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ర‌వీంద్ర జ‌డేజా సైతం మోకాలి నొప్పితో ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని, ఇటు ప్రాక్టీస్ సెష‌న్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ గాయం కాగా.. ఇషాన్ కిష‌న్‌కు తేనటీగ కుట్టిన‌ట్లు తెలుస్తోంది.

తిర‌గ‌బెట్టిన మోకాలి గాయం..!

మోకాలి గాయం కార‌ణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 ర‌వీంద్ర జ‌డేజా దూర‌మ‌య్యాడు. ఆ స‌మ‌యంలో మోకాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొంత‌కాలం విశ్రాంతి తీసుకున్న జ‌డేజా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐస్ ప్యాక్ వేసుకుంటూ క‌నిపించాడు. దీంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే.. అత‌డి గాయం అంత తీవ్ర‌మైన‌ది కాద‌ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. జ‌డేజా స‌హా ఆట‌గాళ్లు అంద‌రిని వైద్య బృందం, ఫిజియో బృందం ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని చెప్పారు.

ప్రాక్టీస్‌లో గాయ‌ప‌డ్డ సూర్య‌కుమార్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్కించుకున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడ‌లేదు. హార్దిక్ గాయ‌ప‌డ‌డంతో అత‌డి స్థానంలో సూర్య‌కుమార్ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్రాక్టీస్‌లో సూర్య‌కుమార్‌కు గాయ‌మైంది. బౌల‌ర్ వేసిన బంతి అత‌డి మ‌ణిక‌ట్టుకు త‌గిలింది. నొప్పితో సూర్య విల‌విల‌లాడాడు. దీంతో అత‌డు ప్రాక్టీస్‌ను అర్థాంత‌రంగా ముగించాడు. గాయం తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు సూర్య‌ను ఆస్ప‌త్రికి పంపించిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది అయితే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆడ‌డం క‌ష్ట‌మే.

Virat Kohli : వ్యాఖ్యాత పొర‌బాటు.. స‌రిద్దిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌..

ఇషాన్‌ను కుట్టిన తేనెతీగ‌..

టీమ్ఇండియా యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా ఓ తేనటీగ అత‌డిని కుట్టింది. అత‌డి త‌ల భాగంలో తేనటీగ కుట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అత‌డు కూడా మైదానాన్ని విడిచి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. కాగా.. వీరి గాయాల‌పై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

IND vs NZ : గ‌త‌కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ పై కివీస్ ఆధిపత్యం.. ఈ సారైనా..!