Brs : ప్రతిపక్షంలోనూ దూసుకెళ్తున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను ప్రశ్నించడంలో సక్సెస్..
తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అంటూ సమర్థవంతమైన అపోజిషన్ గా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది.

Brs : బీఆర్ఎస్.. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పక్షం. పదేళ్ల అధికార పక్షం. ఇప్పుడు ప్రతిపక్షం. పాత్ర ఏదైనా సరే తగ్గేదేలే అంటోంది గులాబీ పార్టీ. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినా, పదేళ్లు సమర్థవంతంగా తెలంగాణను పాలించినా.. ఏడాది కాలంగా ప్రతిపక్ష పాత్రను పోషించినా.. కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యమైంది. గులాబీ బాస్ కేసీఆర్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన తనయుడు కేటీఆర్ అంతా తానై పార్టీని నడిపిస్తున్నారు. ఓవైపు పార్టీని లీడ్ చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తున్నారు.
తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అంటూ సమర్థవంతమైన అపోజిషన్ గా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొదలుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు సుమారు 14ఏళ్ల పాటు కేసీఆర్ సారధ్యంలో గులాబీ పార్టీ కీలక పాత్ర పోషించింది. అలుపెరగని పోరాటం చేయడంతో పాటు ప్రజలందరిని చైతన్యపరిచి, కోట్లాది మందిని భాగస్వామ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత 2014 నుంచి దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను సమర్థవంతంగా పాలించింది. రాష్ట్రాభివృద్ధిలో తనమైన ముద్ర వేసిన కేసీఆర్.. వ్యవసాయం నుంచి మొదలుకుని అన్ని రంగాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దగలిగారు.
తెలంగాణకు గుండె లాంటి హైదరాబాద్ ను ప్రపంచమే అబ్బురపడేలా అభివృద్ది చేశారు. జిల్లాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కార్. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ వస్తోంది.
Also Read : సీఎం రేవంత్ వాగ్ధాటిలో ఘాటు ఎందుకు తగ్గినట్లు? రీజన్ ఏంటి?