Harish Rao : చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్‌కు లేదు, ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం?- హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలు నా దగ్గర ఉన్నాయి.

Harish Rao : చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్‌కు లేదు, ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం?- హరీశ్ రావు

Updated On : March 5, 2025 / 8:07 PM IST

Harish Rao : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలు తన దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు.

చంద్రబాబు సమన్యాయం మాటల్లోనే చేతల్లో కాదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

”కేంద్రాన్ని ఎదిరించే దమ్ము రేవంత్ కి లేదు. రేవంత్ అసమర్థత వల్లే తెలంగాణకు నష్టం జరుగుతోంది. ఆంధ్ర పక్షపాతిగానే సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. కృష్ణా నీటి అంశంలో చంద్రబాబును ఎదిరించే దమ్ము రేవంత్ కు లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు లైఫ్ లైన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు సాగు, తారు నీరు అందిస్తోంది.

Also Read : రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..

కాళేశ్వరం ఆపాలని కేంద్రాన్ని తాను కోరలేదని చంద్రబాబు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలు నా దగ్గర ఉన్నాయి. చంద్రబాబు సమన్యాయం మాటల్లోనే చేతల్లో కాదు” అని విమర్శించారు హరీశ్ రావు.

 

సముద్రంలో కలిసే నీటిని మాత్రమే తీసుకెళ్తున్నాం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చెప్పే చంద్రబాబు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. 500 టీఎంసీలకు బదులుగా 650 టీఎంసీల నీటిని వాడుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

”సముద్రంలోకి పోయే నీళ్లను తీసుకుపోతుంటే దానికి కూడా అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను వెల్ కమ్ చేశా. తెలంగాణలో ఉండే వాళ్లకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకుపోతానని చెప్పా. పోలవరం టు బనకచర్ల. ఎక్కడి నీళ్లు ఇవి. సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఒక పార్టీ రాజకీయం చేస్తే మేము చేయకపోతే వెనుకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు.

తెలుగు దేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. యుగ పురుషుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ఆ రోజు, ఈ రోజు తెలుగు జాతి కోసం పని చేస్తున్నాం. విభజన సమయంలోనూ నాకు రెండు ప్రాంతాలు సమానం, రెండు కళ్లు అని చెప్పాను. ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను” అని ఇటీవల ఓ సభలో చంద్రబాబు అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు నాకు సమానం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీశ్ రావు. ‘ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లలాంటివి అని చంద్రబాబు అంటారు. ఆ మాట నిజమే అయితే చంద్రబాబు.. నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి సాగర్ కుడి కాల్వలో నిండుగా నీరు తీసుకెళ్తున్నారు కదా. దీన్ని ఏమంటారో చెప్పాలి. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సరిపోయేంత నీరు లేక ఖమ్మం, నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి.

Also Read : శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది అతడు కాదు ఆమె.. హత్యకు అసలు కారణమిదే..

ఇదేనా రెండు కళ్ల సిద్ధాంతం? ఇదేనా సమ న్యాయం? నాగార్జున సాగర్, శ్రీశైలం కృష్ణా నది జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం 512 టీఎంసీలు రావాలి. అదే ఎక్కువ. కానీ, మీరు 657 టీఎంసీలు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాలి. కానీ, వచ్చింది 220 టీఎంసీల నీరే వచ్చింది. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, మీరు ఇద్దరూ కలిసి తెలంగాణ నోరు కట్టారు’ అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు హరీశ్ రావు.