Gossip Garage : ఎమ్మెల్సీ ఫైట్‌పై బీఆర్ఎస్ ఎందుకు చేతులెత్తేసింది? ఆ భయమే కారణమా?
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.

Gossip Garage : తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఫైట్‌కు దూరంగా ఉంటోంది. దీంతో కారు పార్టీకి ఏమైంది.. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే చర్చ మొదలైంది. రేవంత్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ..ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నది మాత్రం అంతుచిక్కడం లేదట.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌దే విజయమంటున్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. గులాబీ దళపతి మాటలు విన్న బీఆర్ఎస్ క్యాడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని మాత్రం కారు పార్టీ నేతలు, క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారట.
Also Read : కులగణన సర్వే.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
బరిలోకి దిగకపోవడానికి రీజనేంటన్నది పెద్ద క్వశ్చన్..
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న రేంజ్ డైలాగ్స్ చెప్పిన కేసీఆర్..ఎమ్మెల్సీ పోల్స్‌కు ముఖం చాటేయడంపై మాత్రం ఎవరికీ నచ్చడం లేదట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ కారు పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఇప్పటికీ అంతో ఇంతో పట్టుంది. అయినా రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి రీజనేంటో ఎవరికీ అర్థం కావడం లేదట. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా.. బరిలోకి దిగకపోవడానికి రీజనేంటన్నది పెద్ద క్వశ్చన్‌గా మారింది.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటం ఖాయం, ఉప ఎన్నికలు రావడం పక్కా అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బై ఎలక్షన్స్‌కు సిద్దంగా ఉండాలని క్యాడర్‌కు దిశానిర్ధేశం చేస్తున్న కారు పార్టీ అధిష్టానం..ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎందుకు చేతులెత్తేసిందో అర్ధంకాక అయోమయంలో పడ్డారట నేతలు, కార్యకర్తలు.
వస్తాయో రావో తెలియని ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉండాలని చెబుతున్న బీఆర్ఎస్ అధిష్టానం..అందివచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలను చేజార్చుకుందని మదనపడుతున్నారట కారు పార్టీ లీడర్లు. ప్రత్యర్ధులతో పోటీపడి నిలబడాల్సిన చోట సైలెంట్‌గా తప్పుకోవడం వెనుక మర్మమేంటన్న దానిపై బీఆర్‌ఎస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నదానికి, గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉందట. పార్టీ క్యాడర్ చేజారిపోకుండా కేసీఆర్ పైకే గంభీరంగా మాట్లాడుతున్నారని అంటున్నారు అధికార పార్టీ నేతలు. గ్రౌండ్ రియాలిటీ తెలిసే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. మామూలుగా అయితే ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉండేది.
గులాబీ పార్టీ కంచుకోటగా భావించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే చాలన్నట్టుగా ఉండేది వ్యవహారం. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌లో ఉందని తెలుస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ సీట్లలో ప్రభావం చూపించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకపోవడం వెనుక ఏదో ప్లాన్ ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్‌రావు, కవిత..వీళ్లంతా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల పరిధిలోనే ఉన్నారు. అయినా సరే పోటీకి ఎందుకు వెనుకంజ వేశారనేది ఎవ్వరికి అంతుపట్టడం లేదట.
Also Read : బాబోయ్.. తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..ఇదే కనుక ఉదయం పూట జరిగి ఉంటే..!
కారు పార్టీకి ఆశించినంత అనుకూలంగా లేరని తేలిందట..
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. బలమైన క్యాండిడేట్స్ దొరక్కపోవడం మెయిన్ రీజనట. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కొంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ వైపే మొగ్గుచూపుతారన్న అభిప్రాయానికి వచ్చారట. మూడు నెలల క్రితం బీఆర్ఎస్ అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో..గ్రాడ్యుయేట్స్, టీచర్స్..కారు పార్టీకి ఆశించినంత అనుకూలంగా లేరని తేలిందట.
అందుకే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కారు పార్టీ తప్పుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్సీ బైపోల్‌లో ఓడిపోవడంతో కాస్త డ్యామేజ్ అయిందని..ఇప్పుడు కూడా ఓడిపోతే మరింత నష్టపోతామని భావించారట. అయితే ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉంటే..అధికార పక్షం నుంచి వచ్చే విమర్శలకు ఏం సమాధానం చెప్పాలని మధనపడుతున్నారట జిల్లా స్థాయి నేతలు.